మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (12:13 IST)

కొడాలి నానిపై కేసులకు ఎస్ఈసీ ఆదేశం... కోర్టును ఆశ్రయించిన మంత్రి!

ఏపీ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి నానిపై కేసులు పెట్టాల్సిందిగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. మంత్ర నానిపై ఐపీసీ 504, 505(1)(సీ), 506ప్రకారం కేసులు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుకి ఎస్ఈసీ నుంచి ఆదేశాలు వెళ్ళాయి.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా, సామాజిక శాంతికి భంగం వాటిల్లేలా, అధికారులను బెదిరించే ధోరణిలో మంత్రి నాని వ్యాఖ్యలు చేయడాన్ని పరిగణనలోకి తీసుకుని ఆదేశాలను ఇచ్చారు. 

ఈ మధ్యకాలంలో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంత్రి నాని రెండు రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించి... ఎస్‌ఈసీపై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని మంత్రికి ఎస్‌ఈసీ నోటీసులు జారీ చేశారు.

అయితే, మంత్రి ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండానే బదులిచ్చారు. మంత్రి ఇచ్చిన సమాధానంతో ఎస్‌ఈసీ సంతృ ప్తి చెందలేదు. దీంతో ఎన్నికలు పూర్తయ్యేవరకు మంత్రి కొడాలి నాని మీడియాకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు ఎస్‌ఈసీ శుక్రవారమే ఆదేశాలు జారీ చేశారు. 

ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడ డివిజన్‌లో జరగాల్సిన పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉదయమే తాజా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబును వివరణ కోరగా... తమకు ఎస్‌ఈసీ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, అవి అందిన తర్వాత పరిశీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు. 

మరోవైపు, పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు మీడియాతో మాట్లాడవద్దని ఎస్‌ఈసీ శుక్రవారం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మంత్రి కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. ఈ ఉత్తర్వులు భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటిని రద్దు చేయాలని కోరారు. ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.