గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (20:15 IST)

మన రేపటి కోసం తమ నేటిని పణంగా పెట్టెవారు పోలీసులు: మంత్రి పేర్ని నాని

రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని సంరక్షణను తమ భుజస్కంధాలపై మోస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో మన రేపటి కోసం తమ నేటిని పణంగా పెట్టె పోలీసులు సమాజంలో ఎంతో ముఖ్య భూమిక పోషిస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రశంసించారు. 

మంగళవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమానికి మంత్రి పేర్ని నాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తొలుత  శిక్షణ పూర్తిచేసుకొన్న పోలీసులు నిర్వహించిన పెరేడ్ తిలకించి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఏ ఆర్ కానిస్టేబుళ్లను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. 9 నెలల పాటు పోలీస్‌ శిక్షణలో సుశిక్షితులై బాధ్యతాయుతంగా సేవలు అందించేందుకు సిద్దమైన ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుళ్లకు ముందుగా అభినందనలు తెలిపారు.

క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినపుడు లా అండ్ ఆర్డర్ పోలీసులు శాంతిభద్రతలు అదుపు చేయలేని సమస్య వచ్చినపుడు రాష్ట్రానికి  దిక్కు ఆర్మడ్  పోలీసులు మాత్రమేనన్నారు. రాజకీయ నాయకులు కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని అదే పోలీసులు దాదాపు 30 ఏళ్లపాటు సర్వీసులో ఉంటారన్నారు.

పేదల తరపున నిలిచి వారికి న్యాయం చేసేందుకు పోలీసులు కృషి చేయాలని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బంది సమాజంలో ఎన్ని ఒత్తిడులు, ఒడిదుడుకులు ఎదురైనా .. చెక్కు చెదరని చిరునవ్వుతో విధులు బాధ్యతతో నిర్వహించాలని సూచించారు.

ఉన్నతమైన చదువులు చదువుకొని ఎన్నో కలలతో ఈ రాష్ట్రానికి సేవలు అందించాలనే మహోన్నత లక్ష్యంతో ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఉత్తమ ప్రతిభ కనబర్చి మీరంతా  ఈ కానిస్టేబుల్ ఉద్యోగం  సాధించారన్నారు. మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరుకొంటున్నట్లు చెప్పారు. 

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తపసిపూడి పోలీస్‌ శిక్షణ కేంద్రంలో 215 మంది ఏఆర్‌ కానిస్టేబుళ్ళు ఎంతో  క్రమశిక్షణతో కఠోరమైన శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. 

గతంలో పదవ తరగతి చదివి పోలీస్ ఉద్యోగానికి వచ్చేవారని నేడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ , గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారే అత్యధికంగా ఈ పోస్టులకు రావడం గమనార్హమన్నారు. పోలీస్‌ వ్యవస్థను పటిష్ఠపరిచే చర్యల్లో భాగంగా ప్రభుత్వం సివిల్‌, ఏఆర్‌ విభాగాల్లో పలు నియామకాలు చేపట్టిందన్నారు.

నివాసగృహాలకు దూరంగా, సముద్రతీరానికి దగ్గరగా ప్రశాంత వాతావరణంలో శిక్షణ పూర్తిచేసుకున్న మీరు ఇకపై ప్రజలను కాపాడటానికి ఎంతో బాధ్యతతో విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి పేర్ని నాని అభిలషించారు.     

అనంతరం అడిషనల్ డీజీపి ఎన్. శ్రీధర్ రావు మాట్లాడుతూ,  గత ఏడాది ఎంపికైన 215 మంది అభ్యర్థులు పోలీస్ స్టేషన్ నిర్వహణ , డాక్యుమెంటేషన్ , క్రిమినల్ లా , లా అండ్ ఆర్డర్ , వ్యక్తిత్వ వికాసం , ఇంటిలిజెన్స్ , ఫిజికల్ సైన్స్ , మాస్ డ్రిల్ , ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఏ) వంటివి పోలీస్‌ శాఖకు మూలాధార చట్టాలని  తదితర  వివిధ అంశాల్లో 9 నెలలపాటు ఇండక్షన్‌ శిక్షణ పూర్తిచేసుకొన్నట్లు తెలిపారు.

పోలీస్ విధులు, ఇతర అంశాల గురించి క్షుణ్ణంగా వివరించే పోలీస్‌ మాన్యువల్‌ను ప్రతి ఒక్కరూ అవగతం చేసుకొన్నారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణను పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుని ఉద్యోగంలో రాణించాలని అడిషనల్ డీజీపి ఎన్. శ్రీధర్ రావు ఆకాంక్షించారు.

ఆ తర్వాత  జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ, అభ్యర్థులను శిక్షణ కోసం తపసిపూడి కేంద్రానికి కేటాయించారని, ఇందులో  విశాఖ, విజయవాడ, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలిపారు.

నిత్యజీవితంలో ప్రజలతో సన్నిహితంగా ఉంటూ మానవతా విలువలతో విధులు నిర్వర్తించాలని సూచించారు. రెగ్యులర్‌ శిక్షణతోపాటు బయట నుంచి నిపుణులను ఆహ్వానించి డ్రైవింగ్‌, స్విమ్మింగ్‌ వంటి వాటిల్లో కూడా శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 

ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ఏలూరు రేంజ్  డి ఐ జి  కె. వి. మోహనరావు,  డీఎస్పీ ధర్మేంద్ర,  తదితర పోలీస్  అధికారులు పాల్గొన్నారు.