శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (09:35 IST)

విజయవాడ పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

విజయవాడ నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు అతి చేరువగా సేవలను అందించడం జరుగుతుంది.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా విజయవాడ నగరంలో మొత్తం నిరంత‌రాయంగా విజయవాడ పోలీసుల పర్యవేక్షణలో నగరంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే సంఘటనా స్థలానికి 5 నిమిషాల వ్యవధిలోనే చేరుకుని ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది.

కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న అత్యాధునిక డ్రోన్ కెమేరా, బాడీ వార్న్ కెమేరా, ఫ‌ల్‌కాన్ వాహనాల ద్వారా నగరాన్ని డేగకన్నుతో పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి సంఘటన జరిగినా వెంటనే పసిగట్టి, సమాచారాన్ని అధికారులకు అందించడం ద్వారా ముందుగానే ఆ సమస్యను తెలుసుకొని నియంత్రించడం జరుగుతుంది.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విజయవాడ సిటీ పోలీసులు త‌ర‌ఫున క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు ప్రతిష్టాత్మక ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ టెక్ స‌భ అవార్డును నగర పోలీస్ కమిషనర్ బ‌త్తిన శ్రీనివాసులు, అడ్మిన్ డిసిపి మేరీ ప్రశాంతి అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ... ఈ అవార్డు రావడం విజయవాడ నగర పోలీసులకు గర్వకారణమన్నారు. దీంతో తమ బాధ్యతను మ‌రింత పెంచిందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అనునిత్యం కృషి చేయడం జరుగుతుందన్నారు.

సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలనైనా ప్రాథమిక దశలోనే గుర్తించి అరికడుతున్న‌ట్లు తెలిపారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకు ఎల్లవేళలా కృషి చేస్తామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.