ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జులై 2020 (17:43 IST)

'కొల్లు' ఇంతపని చేశారా? ఇల్లు విడిచి ఎందుకు పారిపోయారు?

మచిలీపట్నంకు చెందిన వైకాపా నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే, మోకా భాస్కర్ రావు భార్య వెంకటేశ్వరమ్మ ఈ హత్యపై స్పందించింది. 
 
ముఖ్యంగా, తన భర్త హత్య కేసులో కొల్లు రవీంద్రను అరెస్టు చేయడంతో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొల్లు రవీంద్ర ఇంతటి ఘోరానికి పాల్పడతారని ఊహించలేకపోయామని ఆమె చెప్పుకొచ్చింది. 
 
భాస్కర్‌రావు ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి అని తెలిపారు. ప్రజా సమస్యలపై ఎవరినైనా నిలదీస్తూ ఉంటారని, గుటాల చెరువు వివాదంపై ప్రశ్నించినందుకే  భాస్కర్‌రావుపై కక్షగట్టారని తెలిపారు. తన భర్తకు మంచి పేరు వస్తుందని ఓర్వలేక కుట్రపన్ని హత్య చేశారని, రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దారుణానికి పాల్పడి హత్య చేస్తారని అనుకోలేదని ఆమె చెప్పారు. 
 
ఈ హత్య కేసులో ప్రమేయం లేకపోతే కొల్లు రవీంద్ర ఇల్లు విడిచి ఎందుకు పారిపోవాలి..? అని ప్రశ్నించారు. తన భర్త హత్య కేసులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరమ్మ కోరారు.  
 
కాగా, గత నెల 29వ తేదీన మచిలీపట్నంలో మోకా భాస్కర్‌రావు పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు. భాస్కర్‌రావు మంత్రి పేర్ని నానికి అత్యంత సన్నిహితుడు కావడం.. మచిలీపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ 23వ డివిజన్‌ వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండగా ఈ హత్య జరగడంతో స్థానికంగా కలకలం సృష్టించింది.