వైకాపా షాకివ్వనున్న మోపిదేవి వెంకటరమణ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైకాపా చిత్తుగా ఓడిపోయింది. వైకాపా బాపట్ల నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఉన్న రాజ్యసభ సభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఇపుడు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఓ నిందితుడుగా ఉంటూ, కొన్ని నెలల పాటు జైలు జీవితం కూడా గడిపిన మోపిదేవి వెంకట రమణ ఇపుడు వైకాపా అధికారం కోల్పోవడంతో తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు.
వైకాపా అధికారంలో కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వీరిలో కొందరు రాజీనామా చేయగా, మరికొందరు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇటీవలే గుంటూరు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు వైకాపాకు టాటా చెప్పేశారు. ఇపుడు మోపిదేవి వెంకట రమణ వంతు వచ్చినట్టుంది. ఆయన త్వరలోనే పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా, నమ్మిన బంటుగా ఉన్న మోపిదేవి... పార్టీని వీడనున్నారనే వార్తలతో పార్టీ శ్రేణులు షాక్‌కు గురవుతున్నాయి. ఆయన త్వరలో టీడీపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వైసీపీలో అంతర్గత విభేదాల కారణంగానే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయనున్నారని సమాచారం. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా మోపిదేవి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.