శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (20:05 IST)

ముంబై నటి జెత్వానీ కేసు : ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు

ips officers
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ముంబై నటి కాదంబరి జెత్వానీపై తప్పుడు కేసు బనాయించి అక్రమ అరెస్టు, శారీరకంగా మానసికంగా వేధించిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులైన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ముగ్గురిపై ముంబై నటి వ్యవహారంతోపాటు పలు అభియోగాలున్నాయి.
 
తప్పుడు కేసులో ముంబై సినీ నటి కాదంబరీ జెత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో కీలకపాత్రధారులని చెబుతున్న నాటి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐపీఎస్‌ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. 
 
ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు.. ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కాదంబరీ జెత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై నివేదికను రూపొందించి డీజీపీకి అందజేశారు. ఈ నివేదికను ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపించారు. ఈ నివేదికను పరిశీలించిన సీఎం.. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సస్పెన్షన్ వేటు పడింది.