గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (11:26 IST)

చంద్రబాబు ఓ రాక్షసుడు.. నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు : జగన్

నంద్యాల వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి మాటలతూటాలు పేల్చారు. చంద్రబాబును సీతమ్మను ఎత్తుకెళ్లిన రాక్షసుడు రావణాసురుడితో పోల్చారు.

నంద్యాల వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి మాటలతూటాలు పేల్చారు. చంద్రబాబును సీతమ్మను ఎత్తుకెళ్లిన రాక్షసుడు రావణాసురుడితో పోల్చారు. అందుకే చంద్రబాబును నడిరోడ్డుపై నిలబెట్టి కాల్చి చంపినా తప్పులేదన్నారు. ఈనెలలో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం గురువారం నంద్యాల వేదికగా వైకాపా బహిరంగ సభ జరిగింది. ఇందులో జగన్ మోహన్ రెడ్డి పాల్గొని విమర్శలు గుప్పించారు. 
 
నంద్యాల ఉప ఎన్నికల్లో సానుభూతి కోసం కుయుక్తులు, కుతంత్రాలు పన్నుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదన్నారు. ముఖ్యంగా నంద్యాల ఉపఎన్నిక ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఈ ఎన్నికలో చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ గ్రంథాలు ధర్మం, న్యాయం గొప్పదన్నారు. చౌకబారు రాజకీయాలు తాత్కాలికంగా గెలిచినా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్తే రాక్షసుడు అన్నారు.
 
అలాగే, దొంగతనం చేస్తే దొంగా అంటారు. మరి... 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్ళిన చంద్రబాబును ముఖ్యమంత్రి అనాలా, దొంగ అని అనాలా? అని ప్రశ్నించారు. నంద్యాల అభివృద్ధి అంటూ అబద్ధాలు, మోసపూరిత జీవోలు విడుదల చేస్తున్నారని విమర్శించారు. నంద్యాల ఉపఎన్నిక ఏకగ్రీవానికి అంగీకరించి... పోటీ పెట్టకపోయి ఉంటే ఒక్క రూపాయి ఇచ్చేవారా? మూడున్నరేళ్లల్లో రూ.3.50 లక్షల కోట్లు దోచుకున్నారు. మోసపూరిత, అసమర్థత, అవినీతి పాలనలకు ఓటుతో గుణపాఠం చెప్పాలి అంటూ జగన్ పిలుపునిచ్చారు. 
 
'2019లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి నంద్యాల ఉప ఎన్నిక నాంది. అప్పుడు అధికారంలోకి వస్తాం. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా చేస్తాం. జిల్లాల సంఖ్యను 25కు పెంచుతాం' అంటూ జగన్ మరో కొత్త ప్రకటన చేశారు.