గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (16:18 IST)

విజయవాడ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన నారా లోకేశ్

lokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. గత 2020లో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో కోవిడ్ నిబందనలు అమల్లోవున్నాయి. 
 
ఈ నిబంధనలను నారా లోకేష్ ఉల్లంఘించారంటూ ఆయనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా వచ్చారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రహదారులను దిగ్బంధించిన పోలీసులు టీడీపీ నేతలు, శ్రేణులను కోర్టు ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
ఈ సందర్భంగా నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, వైఎస్ రాజారెడ్డి రాసిన రాజ్యాంగం పక్కాగా అమలవుతుందంటూ మండిపడ్డారు. ఇప్పటికే 55 మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంతో చేసే పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు.