పెళ్ళి ఆపాలన్న ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్న వధువు సృజన
పెళ్లి ఆపాలన్న ప్రయత్నంలో సృజన అనే వధువు తన ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల విశాఖపట్టణం మధురవాడలో పెళ్లి మండపంలో ఓ వధువు తలపై జీలకర్ర, బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.
అయితే, ఆమె గుండెపోటు కారణంగా మృతి చెందిందని అందరూ భావించారు. అయితే, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు గుండెపోటు రాలేదని ఆత్మహత్య చేసుకున్నట్టు విచారణలో తేలింది.
ఆమె ఉపయోగించిన ఫోను డేటాను పరిశీలించిన పోలీసులు అసలు విషయాన్ని గుర్తించారు. కాల్ డయల్ లిస్టుతో పాటు పెళ్ళికి మూడు రోజుల ముందు ఆమె ప్రియుడుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చాటింగ్ చేసిన వివరాలను పోలీసులు సేకరించారు.
విశాఖలోని పరవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తితో ఆమె ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే, మోహన్‌కు సరైన ఉద్యోగం లేకపోవడంతో సృజనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ వచ్చాడు. పైగా మరికొన్ని రోజులుగా ఆగాలంటూ వధువుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
దీంతో సృజన కూడా తన పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి మాట ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె పెళ్లి ముహుర్తానికి ముందు విషపదార్థం తీసుకుంది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించి స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్పించగా, ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది.