రెండేళ్ల తరువాత అధికారంలోకి వస్తున్నాం.. ఎవ్వరినీ వదలం : నారా లోకేశ్
దొంగ ఓట్లు వేస్తున్న వైసీపీ వాళ్లను అడ్డుకున్నందుకు టిడిపి నేతపై దాడి చేయడమేంటని వైసీపీ నేతల్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిలదీశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన మునిరాజాని మంగళవారం నారా లోకేష్ జూమ్ ద్వారా పరామర్శించారు.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మండలం 46వ బూత్‌లో దొంగ ఓట్లు వేస్తున్న వైసీపీ వారిని మునిరాజా అడ్డుకున్నారు. తమని అడ్డుకున్నారనే కక్షతో వైసీపీకి చెందిన చదలవాడ కుమార్ మరో ముగ్గురితో కలిసి మునిరాజాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తనపై జరిగిన దాడిని మునిరాజా లోకేష్‌కి వివరించారు.
పెద్ద వయస్సు వాడినని కూడా కనికరించని వైసీపీ గూండాలు చాలా దారుణంగా కొట్టారు అని విలపించారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునిరాజాకి ధైర్యం చెప్పిన నారా లోకేష్.. లీగల్ టీమ్‌తో మాట్లాడి దాడిచేసిన వారిపై కేసు పెట్టాలని సూచించారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేద్దామన్నారు.
రెండేళ్లలో జగన్‌రెడ్డి అరాచక ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, వచ్చేది టిడిపి ప్రభుత్వమేనని, అప్పుడు ఈ వైసీపీ గూండాల పని పడతామన్నారు. దాడులు చేసినవారిని, చట్టబద్ధంగా వ్యవహరించని పోలీసుల్ని అందర్నీ గుర్తు పెట్టుకున్నామని, ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పార్టీ అన్నివిధాలా అండగా వుంటుందని మునిరాజాకి ధైర్యం చెప్పారు.