రమ్య కేసు విచారణ, ఆంధ్రప్రదేశ్ చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్
గుంటూరులో బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిజనిర్ధారణకు జాతీయ ఎస్సి కమిషన్ ఆంధ్రప్రదేశ్ కు చేరింది. గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న జాతీయ ఎస్సి కమిషన్ బృందానికి భాజపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
ఎస్సీ కమిషన్ బృందంలో వైస్ చైర్మన్ అర్జున్ హల్ధార్, మెంబెర్స్ డాక్టర్ అంజుబాల, సుభాష్ రంగనాథ్, భాజపా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు, సరణాల మాలతి రాణి, ఎస్సి మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్, మహిళా మోర్చా అధ్యక్షురాలు, నిర్మలా కిషోర్ పలువురు దళిత నాయకులు ఉన్నారు.
వీరంతా గుంటూరులో రమ్య హత్యపై నిశిత పరిశీలన చేస్తారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి నుంచి సంఘటన వివరాలను అడిగి తెలుసుకుంటారు. రమ్య హత్యపై ఏపీ ప్రభుత్వం వెనువెంటనే చర్యలు చేపట్టడంతో ఆ కుటుంబానికి ఇప్పటికే కొంత ఊరట లభించింది. నిందితుడు సత్య కృష్ణను వెంటనే అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. అయితే, ఈ కేసులో ఏదైనా లొసుగులు ఉన్నాయా? అనే కోణంలో జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ జరపనుంది. అలాగే, కమిషన్ సభ్యులు, ఏపీ డీజీపిని, ఏపీ హోం మంత్రిని కూడా కలిసే అవకాశం ఉంది.