'కాంచన-3' నటి అలెగ్జాండ్రా జావి ఆత్మహత్య
రాఘవ లారెన్స్ నటించిన చిత్రం 'కాంచన-3'. ఇందులో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా జావి నటించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోవాలోని తన నివాసంలో ఆమె శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు, పోలీసులు వెల్లడించారు.
గత కొన్నిరోజుల క్రితమే ప్రియుడి నుంచి అలెగ్జాండ్రా విడిపోయిందని.. దీంతో ఆమె మానసికంగా కుంగుబాటుకుగురై.. ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. దీంతో, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రష్యాకు చెందిన అలెగ్జాండ్రా మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ఆమె భారత్‌కు వచ్చారు. గత కొంతకాలం నుంచి గోవాలో నివాసముంటున్నారు. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన కాంచన-3లో అలెగ్జాండ్రా ఓ కీలకపాత్ర పోషించారు.
ఇక, వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. తనని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌పై ఆమె 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పట్లో ఆ ఫొటోగ్రాఫర్‌ని అరెస్ట్ చేశారు. అలెగ్జాండ్రా మృతి కేసు విచారణలో భాగంగా సదరు ఫొటోగ్రాఫర్‌ని సైతం పోలీసులు విచారించనున్నారు.