బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (20:16 IST)

కోవిడ్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలి: ఎన్‌సిసి విద్యార్థుల అవగాహన ర్యాలీ

లాక్‌డౌన్ ఆంక్షలను, కోవిడ్ -19 మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని కోరుతూ విజయవాడ‌ వన్‌టౌన్‌లోని యస్.కే.పి.వి.వి. హిందూ హైస్కూల్ ఎన్‌సిసి విద్యార్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాల ఎన్‌సిసి అధికారి బి.బ్రహ్మేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కంచెర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోద‌వుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలను, కోవిడ్ -19  మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్‌లు ధరించడం, చేతుల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవ‌డం, భౌతిక‌ దూరాన్ని పాటించ‌డం వంటివి తూ.చ త‌ప్ప‌కుండా పాటించాల‌న్నారు.

బ‌హిరంగ ప్ర‌దేశాల‌తో పాటు పని ప్రదేశాల్లోనూ విధిగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని సూచించారు. చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తమ ఇళ్ళల్లోనూ, పరిసర ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించాలని కోరారు.

ఈ సంద‌ర్భంగా ఎన్‌సిసి విద్యార్థులు ప్లకార్డులు చేతబూని "కరోనా నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత" అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వ‌హించి ప్రజలను ఆలోజింప‌చేశారు.