శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 30 నవంబరు 2020 (20:08 IST)

మండలిలో చంద్రబాబు 'మనసులో మాట' వివాదం

ఎపి శాసనమండలిలో తుపాను నష్టంపై జరిగిన చర్చ సందర్బంగా వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై విమర్శలు చేసిన టిడిపి ఎమ్మెల్సీలకు గతంలో చంద్రబాబు నాయుడి ''మనసులో మాట'' పుస్తకంలోని వ్యాఖ్యలు ఇబ్బందిపెట్టాయి. రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల తమకు ప్రేమ వున్నట్లు మాట్లాడిన టిడిపి ఎమ్మెల్సీలకు తమ నాయకుడు చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇరుకున పెట్టాయి. 
 
తుపాను నష్టం విషయంలో రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ టిడిపి ఎమ్మెల్సీ బిటి నాయుడు చేసిన ఆరోపణలపై మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాద్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి రైతులు, వ్యవసాయం అంటే అపారమైన గౌరవం వుందని,  వైయస్ జగన్ రైతుపక్షపాత ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు.

టిడిపి అధినేత చంద్రబాబులాగా వ్యవసాయం దండుగ, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని మాట్లాడుతూ వ్యవసాయం పట్ల చిన్నచూపు చూసే విధానం మాది కాదు అంటూ స్పష్టం చేశారు. భారీవర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు అంటూ పర్యటన చేసిన లోకేష్‌కు అసలు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు.

అసలు ఏ ప్రాంతంలో ఏ పంటలు వేస్తారో కనీస అవగాహన వుందా అని నిలదీశారు. అటువంటి లోకేష్ కూడా వ్యవసాయంపై మాట్లాడటం విడ్డూరంగా వుందని అన్నారు. మరోవైపు మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా వున్న సమయంలో గత అయిదేళ్ళలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని కూడా ఇవ్వకుండా బకాయి పెట్టిన ఘనత వారికే దక్కుతుందని అన్నారు.

చివరికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు పెట్టిన బకాయిలను కూడా సీఎంగా వైయస్ జగన్ చెల్లించారని, ఇదీ మా ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ది అని పేర్కొన్నారు. తుపాను నష్టంపై టిడిపి ఎమ్మెల్సీలు చేసిన విమర్శలకు జవాబుగా మంత్రులు వ్యవసాయంపై గత తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన వైఖరిని మండలిలో ఎండగట్టడంతో టిడిపి ఎమ్మెల్సీలు ఆత్మరక్షణలో పడ్డారు.

సభలో లేని చంద్రబాబు పేరును మంత్రులు ఎలా ప్రస్తావిస్తారంటూ లోకేష్, టిడి జనార్థన్‌లు మొదట్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వ్యవసాయం దండుగ అనే మాట చంద్రబాబు ఎక్కడ అన్నారో నిరూపించాలంటూ డిమాండ్ చేశారు. దీనిని నిరూపిస్తే టిడిపి ఎమ్మెల్సీలు అందరూ రాజీనామా చేస్తారని, నిరూపించలేక పోతే మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేస్తారా అంటూ టిడి జనార్ధన్ సవాల్ చేశారు. 

దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ,  బుగ్గన రాజేంద్రనాధ్‌లు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు తన అభిప్రాయాలతో వెలువరించిన 'మనసులో మాట' అనే పుస్తకంలో వ్యవసాయం దండుగ అంటూ రాసుకున్నారని, ఈ పుస్తకాన్ని ఆనాడు శాసనసభ్యులే సభలో చూపించారని గుర్తు చేశారు. కావాలంటే ఆనాటి శాసనసభ రికార్డుల నుంచి దానిని తీసుకోవచ్చిన అన్నారు.

అలాగే చంద్రబాబు బహిరంగంగానే ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వుంటుందంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడారని గుర్తు చేశారు. దమ్ముంటే ఈ వ్యాఖ్యలు తాను చేయలేదని చంద్రబాబుతో చెప్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంపై ఇటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందునే మనసులో మాట పుస్తకాన్ని మార్కెట్‌లో దొరకకుండా చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌ విమర్శించారు.