శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (05:30 IST)

రాష్ట్రాన్ని రావణకాష్టం చేయవద్దు: చంద్రబాబు హెచ్చరిక

రాష్ట్రాన్ని రావణకాష్టం చేయవద్దని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వైకాపా బాధితులంతా ఏకమై నిరంకుశ పాలనపై సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే గెలవలేమనేదే వైకాపా భయమని, బాధిత వర్గాలన్నీ ఏకమై ఓడిస్తారనే వెనుకంజ వేస్తున్నారని అన్నారు. 
 
బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనార్టీలలో వైకాపాపై తీవ్ర వ్యతిరేకత ఉందని అభిప్రాయపడ్డారు. అంతా కలసికట్టుగా రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్‌ను కాపాడుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. వైకాపాను వదిలించుకోకపోతే రాష్ట్రానికి పట్టిన పీడ వీడదని ధ్వజమెత్తారు. 
 
మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. 
 
తిరుపతి ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలన్న చంద్రబాబు..వైకాపా వచ్చాక ఏ వర్గానికి ఎంత మేర నష్టం జరిగిందనేది ప్రతీ మండలంలోనూ వివరించాలని సూచించారు. ఎలాంటి నేరం చేయకుండానే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ మండల కమిటి అధ్యక్షులతో నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘మండల పార్టీ కమిటిల పనితీరు  బాగుండాలి. మరింతగా భాగస్వామ్యం పెరగాలి, ఉత్సాహంగా పనిచేస్తున్న అందరికీ అభినందనలు. మండలంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం, పేదలకు అండగా ఉండటం, పార్టీని బలోపేతం చేయడం, దూరమైన వర్గాలను చేరువ చేయడం.. మండల టిడిపి నాయకులు బాధ్యతగా తీసుకోవాలి. 
 
ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలి. తిరుపతి ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవాలి. ఈ ఎన్నికల్లో కీలకపాత్ర మండల పార్టీ అధ్యక్షులదే..రాష్ట్ర సమస్యలపై ఆందోళనలతో పాటు, ప్రతి మండలంలో స్థానిక సమస్యల పరిష్కారంపై రాజీలేని పోరాటం చేయాలి. స్థానికంగా వైసిపి అవినీతిని ఎండగట్టాలి, ప్రజలపై దాడులను నిరసించాలి.
 
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం నష్టపోయాం..? టిడిపి ప్రభుత్వమే ఉంటే రాష్ట్రం ఎలా ఉండేది..? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి, ఎన్ని పరిశ్రమలు వచ్చేవి, ఎంతమందికి ఉపాధి వచ్చేది..? వైసిపి రావడం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది..? అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
 
రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం, విభజన నష్టాలను పూడ్చడంపైనే దృష్టి పెట్టి టిడిపి హయాంలో అనేక పనులు చేశాం. పార్టీకి పేరువస్తుంది, ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే ఉద్దేశంతో అన్ని గ్రామాలు, వార్డుల్లో పలు అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేశాం.

జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు 2పంటలకు నీళ్లిచ్చే పోలవరాన్ని నిర్లక్ష్యం చేశారు. రూ 2లక్షల కోట్ల రాష్ట్ర సంపద అమరావతిని నాశనం చేశారు. ప్రత్యేకహోదాను గాలికి వదిలేశారు. రూ16లక్షల కోట్ల పెట్టుబడులతో టిడిపి వివిధ కంపెనీలతో ఎంవోయూలు చేస్తే అన్నింటినీ పోగొట్టారు. యువత ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. ఇసుకలో, మద్యంలో చివరికి పేదల ఇళ్ల స్థలాల్లో, ప్రతిదానిలో వైసిపి నాయకుల దోపిడీనే..

అందరికీ ఉచితంగా ఇళ్లు అందిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు కొంతమందికే ఉచితం అంటున్నారు. ప్రతి స్కీములోనూ ఆంక్షలు, షరతులతో పేదల సంక్షేమానికి గండి కొట్టారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు ఇళ్ల నిర్మాణం టిడిపి చేసింది. గేటెడ్ కమ్యూనిటి తరహాలో ఇళ్లు నిర్మించాం. ఇళ్లన్నీ పేదలకు ఉచితంగా ఇస్తామని టిడిపి మేనిఫెస్టోలో పెట్టాం. వైసిపి కూడా అదేచెప్పి ఇప్పుడు మోసం చేస్తోంది. వాళ్ల మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయింది. 
 
వైసిపి అధికారంలోకి రాగానే మొదట టిడిపి నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. తర్వాత ఇతర ప్రతిపక్షాలపై దాడులు చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రజలపైనే దాడులకు తెగబడ్డారు. బిసి,ఎస్సీ,ఎస్టీ, ముస్లిం మైనారిటిలను తీవ్రంగా వేధిస్తున్నారు. 

బాధిత వర్గాలన్నీ జెఏసిలు పెట్టుకుని పోరాడాల్సిన పరిస్థితి. అమరావతి జెఏసి, ముస్లింల జెఏసి...
కోర్టులపై దాడులు, జడ్జిలపై దాడులు, ఎన్నికల సంఘంపై దాడి...రాజ్యాంగ సంస్థలపై ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు..మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎంపిటిసి అభ్యర్ధి భర్త కృష్ణయ్య యాదవ్, వీరాస్వామి యాదవ్ లపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.  
 
గోల్డ్ షాపులో పనిచేస్తుంటే బంగారం చోరీ నేరం మోపారు. ఆటో నడుపుకుని బతుకుతుంటే అందులోనూ దొంగతనం నెపం వేసి వేధించారు..ఏం తప్పు చేశారని అబ్దుల్ సలాం కుటుంబాన్ని సామూహిక ఆత్మహత్యలకు పాల్పడేలా చేశారు..? 

స్మశానంలో వైసిపి మట్టి తవ్వకాలు అడ్డుకోవడం గుంటూరు మౌజమ్ హనీఫ్ నేరమా..? అతడిని వేధించి ఆత్మహత్యా యత్నం చేసుకునేలా చేస్తారా..? ఇసుక దోపిడి అడ్డుకోవడం వరప్రసాద్ తప్పా, శిరోముండనం చేయిస్తారా..? తన బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన వాళ్లను శిక్షించాలని కోరడం అబ్దుల్ సత్తార్ తప్పా..? ఎస్పీ కార్యాలయం వద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా చేస్తారా..? 

ఏం తప్పు చేశాడని అచ్చెన్నాయుడిని 80రోజులు జైలుకు పంపారు..? ఏం నేరం చేశాడని కొల్లు రవీంద్రను జైల్లో పెట్టారు..?  ఏం నేరం చేశారని ప్రతిపక్షాల నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు..? ఈ అరాచకాలకు పాల్పడినవాళ్లంతా ఎక్కడికి పోతారు..? ఆ ఊళ్లలో తిరగాల్సిందే కదా..? బాధితులకు ఎదురు పడాల్సిందే కదా..? మళ్లీ ప్రభుత్వం మారితే వీళ్ల కథ ఏమిటి..?ఇప్పుడీ దుర్మార్గాలకు పాల్పడేవాళ్లు, వాటికి వంతపాడే అధికారులు ఈ విషయం గుర్తుంచుకోవాలి.
 
పోరాడితే పోయేదేమీ లేదు, తప్పుడు కేసులు- అక్రమ నిర్బంధాలు తప్ప.. వెనుకంజ వేస్తే ఆస్తులనే కాదు, జీవితాలనే కోల్పోతాం. భయపడితే మాత్రం అన్నివిధాలా నష్టం జరుగుతుంది. అసలు దిశ చట్టం ఎక్కడైనా ఉందా..? మీరు పెట్టే యాప్ లు పనిచేస్తున్నాయా..? పనిచేయని యాప్ లకు ప్రచార ప్రకటనలా..?

రొటీన్ గా విడుదల చేసే నిధులకు కూడా ప్రచార ప్రకటనలా..?  సిఎం సొంత మీడియా వ్యాపారం కోసం వందల కోట్ల యాడ్స్ ఇవ్వడం ఎక్కడైనా ఉందా..?  ఇసుకపై ఎన్ని డ్రామాలు ఆడారు..? మద్యంపై ఎన్నికథలు చెబుతున్నారు..? పించన్లు, అమ్మవడిపై ఎన్ని అబద్దాలు ఆడారు..? మళ్లీ ఎర్ర చందనం విచ్చలవిడి స్మగ్లింగ్ వైసిపి అండతో కాదా..?
 అవినీతి సంపాదనలో వాటాల కోసం వైసిపి నాయకులే రోడ్డెక్కి కొట్లాడుకుంటున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక పారిపోయే పరిస్థితి వైసిపిది..
 
టిడిపి ప్రభుత్వం కట్టిన ఇళ్లు పేదల హక్కు. మీకు ఒక ఆస్తిగా, మీ బిడ్డలకు ఒక భద్రతగా ఇచ్చాం. మురికి కూపాలుగా మారకుండా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేశాం. ఫ్లోరింగ్, కిచెన్,వార్డ్ రోబ్స్ తో ఆధునికంగా ఇళ్లు నిర్మించాం. ఒక్కో కుటుంబానికి రూ 10లక్షల విలువైన ఇల్లు కట్టించాం...  ప్రతి పేద కుటుంబం కల నిజం చేయాలని చూశాం. 
పేదల కలను భగ్నం చేయాలని వైసిపి దుర్మార్గులు కంకణం కట్టుకున్నారు. ఒక హక్కుగా పొందిన ఇళ్లను పేదలనుంచి ఎలా లాక్కుంటారు..? 

అసంపూర్తి పనులన్నీ పూర్తిచేసి ఇళ్లన్నీ పేదలకు అప్పజెప్పక పోతే నేనే వస్తాను, నేనే రోడ్డెక్కి ఆందోళన చేస్తాను. 
ప్రజాబలం ముందు నియంతలంతా తల వంచాల్సిందే. రాష్ట్రాన్ని రావణకాష్టం చేయవద్దని హెచ్చరిస్తున్నాను. 
కట్టిన ఇళ్లు లాటరీలో పొందిన లబ్దిదారుల స్వాధీనం చేయండి. మరిన్ని కొత్త ఇళ్లు కట్టి కొత్త లబ్దిదారులకు ఇవ్వండి.
 
మైక్రో ఇరిగేషన్ లో సబ్సిడి ఎగ్గొట్టారు, క్రాప్ ఇన్సూరెన్స్ అతీగతీ లేదు. విపత్తుల్లో నష్టపోయిన పంటలకు పరిహారం లేదు. రైతులను అప్పుల్లో ముంచేశారు. ఎక్కడో ఉన్న అముల్ డెయిరీ(గుజరాత్)ని ఇక్కడకు తెచ్చి వాళ్లకోసం రూ 1,300కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. స్థానికంగా రైతుల డెయిరీలను, సహకార డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారు. 
 
అన్నా కేంటిన్లు మూసేశారు, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, బీమా పథకం రద్దు చేశారు, పేదల నోళ్లు కొట్టారు. 
నవరత్నాల వల్ల పేదలకు కలిగిన లాభం కన్నా, ఏడాదిన్నరలో వేసిన భారాల వల్ల( కరెంటు బిల్లులు, ఇసుక, మద్యం రేట్లు పెంపు..) మూడు నాలుగు రెట్లు నష్టం చేశారు.   

వైసిపి పాలనలో పేద కుటుంబాలకు కలిగిన లాభం కన్నా, మూడు నాలుగు రెట్లు నష్టం ఎక్కువ జరిగింది. ఆటో డ్రైవర్ కు రూ 10వేలు ఇస్తానని చెప్పి, ఫైన్లు దానికి రెండు మూడు రెట్లు వేస్తున్నారు. 

వైసిపిలో చేరితేనే రుణాలు ఇస్తాం, ప్రభుత్వ పథకాల లబ్ది వస్తుంది అని బెదిరింపులకు పాల్పడటం హేయం. 
5ఏళ్లలో చేసిన అప్పు ఒక్క ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి చేశారు. 10ఏళ్లలో పేదలపై పడిన భారాలు ఒక్క ఏడాదిలోనే వేశారు. పట్టణాల్లో నీటిపన్ను, డ్రైనేజి సెస్, ఆస్తిపన్ను పెంచుతున్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. రోడ్లపై గుంతలు పూడ్చకుండా కొత్తగా టోల్ గేట్లు పెడుతున్నారు.

వైసిపి కార్యకర్తల మేళ్ల కోసం తప్ప ప్రజల మేళ్ల కోసం చేసిన పనులు లేవు. ఓట్లు వేసిన ప్రజలను నమ్మించి మోసం చేశారు.  రియల్ టైమ్ గవర్నెన్స్, 1100 కాల్ సెంటర్, ప్రజావేదిక... విపత్తుల్లో బాధితులకు ఎంతో ఉపయోగపడే కమ్యూనికేషన్ వ్యవస్థలను టిడిపి నిర్మిస్తే వాటిని నాశనం చేయడం ద్వారా రాష్ట్రానికి తీరని నష్టం చేశారు.

హుద్ హుద్, తిత్లి తుపాన్ బీభత్సాలలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలతో ప్రజలకెంతో ప్రయోజనం. వైసిపి విధ్వంసం వల్ల ఇప్పుడీ విపత్తుల్లో(వరదలు, భారీవర్షాలు) బాధితులను ఆదుకోవడం, అప్రమత్తం చేయడంలో విఫలం చెందారు. 
గతంలో ఏపి అభివృద్ది పనులను ఇతర రాష్ట్రాలు అనుసరించేవి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలే అభివృద్ది పనుల్లో ముందంజలో ఉంటే ఏపి వెనుకబడటానికి వైసిపి నిర్వాకాలే కారణం.

ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మార్చి ఏప్రిల్ నెలల్లో సగం జీతాలు చెల్లించి పూర్తి వేతనం చెల్లిస్తున్నట్లు తప్పుడు నివేదికలు కాగ్ కు పంపారు.  పేటిఎం బ్యాచ్ తో ప్రభుత్వాన్ని పొగిడిస్తున్నారు. సమస్యలపై పోరాడేవాళ్లను వేధిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు చేసేవాళ్లను ఖండించడు. దాడులకు పాల్పడేవాళ్లను అడ్డుకోడు. బూతులు తిట్టేవాళ్లను మరింత ఎంకరేజ్ చేస్తాడు. విధ్వంసాలను ప్రోత్సహిస్తాడు, నేరాలను అడ్డుకోడు, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయరు...ఇదంతా ఏమిటి ఉన్మాదం కాకపోతే..? ప్రజలే ఈ ఉన్మాదానికి గుణపాఠం చెబుతారు.

వేధింపులు ఎంత ఎక్కువైతే ప్రజల్లో వైసిపిపై అంత వ్యతిరేకత. బాధితులంతా సంఘటితంగా పోరాడాలి. వైసిపి బాధితులంతా ఏకం కావాలి. అణిచివేతపై, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలపై పోరాటం చేయాలి. 
కోర్టులు చిన్న వ్యాఖ్యలు చేసినందుకే సంజీవరెడ్డి, జనార్దన్ రెడ్డి రాజీనామాలు చేశారు. విలువలు కాపాడారు. అవేమీ జగన్మోహన్ రెడ్డికి పట్టవు.  

ప్రతిరోజూ కోర్టులు ఛడమడా చివాట్లు పెడుతున్నా చీమ కుట్టినట్లు కూడా లేదు. కోర్టులపై కూడా ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారు. నేరస్తులు నిప్పుతో ఆడుకుంటున్నారు. ఏదో ఒకరోజు అది వారిని దహించేస్తుంది, నేరస్తులంతా ఉన్నత పదవుల్ని అధిరోహిస్తే ప్రజాస్వామ్యాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటారని’’ న్యాయస్థానాల వ్యాఖ్యలు మన రాష్ట్రంలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. 
 
వైసిపి దుర్మార్గాల వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం, భావితరాలకు వాటిల్లే కీడు పూడ్చలేనిది. అనేక రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంటే మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు అడ్డం పడుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలవలేమనేదే వైసిపి భయం. బాధిత వర్గాలన్నీ ఏకమై ఓడిస్తారనేదే వైసిపి భయం. బిసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనార్టీలలో వైసిపిపై తీవ్ర వ్యతిరేకత. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెనుకంజ వేస్తున్నారు. 
 
ప్రజలే తిరగబడితే వైసిపి డబ్బులు పనిచేయవు. అధికార బలం పనిచేయదు. కండబలం పనిచేయదు అనేది గుర్తుంచుకోవాలి. వైసిపి పాలనలో రైతులు, పేదలు, మహిళలు, యువత, బలహీనవర్గాల ప్రజలకు తీవ్ర నష్టం కల్గించారు.

రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. వీళ్లను వదిలించుకోకపోతే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వీడదు.
మనందరం కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాలని’’ టిడిపి మండల కమిటి నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.