నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు
జిల్లా కేంద్రమైన నెల్లూరు జిల్లా ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై వైద్యారోగ్య శాఖ సస్పెన్షన్ వేటువేసింది. ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో నిపుణులు చేసిన సిఫార్సుల మేరకే ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది.
జూన్ 5నే ప్రభాకర్‌ను కర్నూలు వైద్య కళాశాలకు బదిలీ చేస్తూ తాత్కాలిక చర్యలు తీసుకోగా తాజాగా సస్పెండ్ చేశారు. ఈ విచారణ సమయంలో నెల్లూరు విడిచి వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశించింది.
ఆడియో రికార్డింగ్ ద్వారా బయటకు వచ్చిన వేధింపుల ఘటన 10 నెలల క్రితం జరిగినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆడియో టేపులు సామాజిక, ప్రసార మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.