గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (08:14 IST)

భారీ బందోబస్తు మధ్య ఆనందయ్య కరోనా మందు తయారీ

నెల్లూరు జిల్లా కృష్ణపట్న గ్రామంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా బాధితుల కోసం పంపిణీ చేసే మందు తయారీని మళ్లీ ప్రారంభించనున్నారు. ఏపీ హైకోర్టుతో పాటు.. ఏపీ ప్రభుత్వ అనుమతితో ఈ మందును సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. 
 
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ కాంప్లెక్స్‌లో దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా చేస్తున్నారు. ఆయుర్వేద మందు తయారీ ప్రక్రియకు నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. 
 
నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నుంచి తయారీ మొదలు కావచ్చని, మందు తయారీకి మరో మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. తొలుత సర్వేపల్లి నియోజక వర్గానికి లక్ష ప్యాకెట్లు సిద్ధం చేయనున్నారు. 
 
మరోవైపు, ఆనందయ్య అందిస్తున్న కరోనా మందు తయారీలో భాగస్వాములయ్యేందుకు గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరుకు చెందిన నితిన్‌ సాయి ముందుకొచ్చారు. ఆయన విశాఖ గీతం వర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 
 
ఆనందయ్య మందు తయారీకి అవసరమైన 1.5 టన్నుల పసుపు కొమ్ములను ప్రత్యేక వాహనంలో వెల్లటూరు నుంచి కృష్ణపట్నానికి గురువారం పంపించారు.