బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (08:13 IST)

ఏపీలో నేటి నుంచి కొత్త పెన్షన్‌ కార్డులు

ఏపీలో పింఛను పొందే లబ్ధిదారులందరికీ ప్రత్యేక పెన్షన్‌ గుర్తింపు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి పంపిణీ చేయనుంది.

వివిధ రకాల పింఛన్లకు సంబంధించి ఫిబ్రవరిలో 54,68,322 మందికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగా.. వారందరికీ సోమవారం నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వలంటీర్ల ద్వారా కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో రాజాబాబు తెలిపారు.

ఫిబ్రవరి నెలలో కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి పింఛను పుస్తకంతోపాటు గుర్తింపు కార్డు ఇస్తారు. మిగిలిన పాత పింఛనుదారులందరికీ ఇప్పటికే పింఛను పుస్తకాలు పంపిణీ చేసిన నేపథ్యంలో వారికి కొత్తగా కేవలం గుర్తింపు కార్డులను మాత్రమే పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు.

ఇదిలావుండగా.. అనర్హులుగా తేలిన వారికి సంబంధించి ప్రస్తుతం రీ సర్వే జరుగుతోందని, ఇందులో అర్హులుగా తేలిన వారికి మార్చి 1వ తేదీన గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా 6,14,244 మందికి పింఛన్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.