సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (10:49 IST)

సీఎం జగన్ ఏలుబడిలో 9 నెలలుగా వేతనంలేని ఉద్యోగం...

ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తుంది. సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. కొందరికీ అరకొరగా ఇస్తుంది. మరికొందరికి నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండికూడా నెల నెలా జీతం ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ గగనంగా మారింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని ఉద్యోగులకు గత 9 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. 
 
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా కొన్ని జిల్లాలను హడావుడిగా ఏర్పాటు చేసింది. ఈ జిల్లా ఏర్పాటు అయితే ఘనంగా చేసినప్పటికీ ఆ జిల్లా కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు. దీంతో కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పటం లేదు. గత ఏడాది ఉమ్మడి కృష్ణా జిల్లాను ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలుగా ఏర్పాటు చేశారు. 
 
ఎన్టీఆర్‌ జిల్లా డీఈవో (విద్యాశాఖాధికారి)గా పశ్చిమగోదావరి జిల్లా డీఈవో సి.వి.రేణుకను నియమించారు. ఆమెకు 9 నెలలుగా జీతం రాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాకు డీఈవో పోస్టు అధికారికంగా మంజూరు కాకపోవడమే ఇందుకు కారణం. డీఈవోను డీఎస్‌ఈవోగా(జిల్లా స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారి) చూపినా జీతం విడుదల కాలేదు. దీంతో ఆఘమేఘాల మీద కృష్ణా జిల్లా డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా(డైట్‌ ప్రిన్సిపల్‌ పోస్టు డీఈవో పోస్టుకు సమానం. రెండూ జిల్లా స్థాయి పోస్టులే) నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. 
 
రేణుక సోమవారం డైట్‌ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్‌ జిల్లా డీఈవో(ఎఫ్‌ఏసీ)గా ఆమె కొనసాగుతారు. తాను జీతం కోసమే ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు అధ్యాపకుల సమావేశంలో ఆమె తెలిపారు. దీనిపై రేణుకను వివరణగా కోరగా... జీతం కోసం అంగలూరు డైట్‌ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు తీసుకున్నానని, ఎఫ్‌ఏసీగా పాత ప్రిన్సిపల్‌ కొనసాగుతారని వెల్లడించారు.