ఆ పోస్టింగులతో సంబంధం లేదు: చెవిరెడ్డి
జగన్, చిరంజీవిల మధ్య సఖ్యత నెలకొనకుండా వుండేందుకు పోస్టింగులు పెట్టించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ఆ పోస్టింగులతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేసారు.
"మెగాస్టార్ చిరంజీవిగారిపై నా అభిమాన సంఘం పేరిట సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ పోస్టింగులకూ నాకూ ఎటువంటి సంబంధం లేదు. నాకు ట్విట్టర్ అక్కౌంట్లు కాని, ఫేస్‌బుక్ అక్కౌంట్లుగాని లేవు. నేను తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా ఉన్నరోజుల్లో చిరంజీవిగారు ఎమ్మెల్యేగా ఉండేవారు.
అప్పటినుంచి ఆయనతో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. వైయస్.జగన్మోహన్‌రెడ్డిగారికీ, చిరంజీవిగారికీ మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశంపార్టీయే ఈ దుష్ప్రచారానికి పూనుకుంది. నాకు అభిమాన సంఘాలు అంటూ లేవు. అభిమాన సంఘాలు అంటూ ఉంటే.. జగన్‌గారికి మాత్రమే ఉంటాయి.
నేనూ జగనన్న అభిమానినే. నా అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను" అని తన ప్రకటనలో చెవిరెడ్డి పేర్కొన్నారు.