టమాటా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించేలా చర్యలు.. ప్రాసెసింగ్ సెంటర్లు కూడా..?
అనంతపూర్‌లో టమాటా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సమీక్షా సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ టమోటా రైతులు నష్టపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్‌పై కూడా ఆయన ఆరా తీశారు. దాని పురోగతి నత్తనడకన సాగుతోందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పంటను ఈ-క్రాప్ విధానంలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
టమాటా ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ధరల పతనానికి గల కారణాలను అధ్యయనం చేయాలని శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ సంస్థలు, సంక్షేమ హాస్టళ్లకు టమాటా సరఫరా చేయవచ్చని కలెక్టర్ సూచించారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ, వ్యవసాయ సంచాలకులు నరసింహారావు, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ పాల్గొన్నారు.