ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 6 అక్టోబరు 2021 (13:19 IST)

ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూల‌పు సురేష్

ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ - 2021 పరీక్ష ఫలితాలను మంత్రులు ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూల‌పు మాట్లాడుతూ, రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కోసం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేక పోవటంతో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. 
 
నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని 4400 సీట్లకు 71,207 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారన్నారు. ఒక్కొక్క సీటుకు 80 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పది రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేశామని, త్వరలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐఐటీ స్థాయి విద్యను అందించటం కోసమే వైయస్సార్ హయాంలో ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారన్నారు. 
 
ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాలకు త్వరలోనే సీఎం జగన్ శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గతంలో ట్రిపుల్ ఐటీ కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించడం వల్లే భవనాల నిర్మాణంలో జాప్యం జరిగిందని ఆరోపించారు. ఈ ఏడాది అడ్మిట్ అయ్యే విద్యార్థులకు ఒంగోలు క్యాంపస్‌లో సౌకర్యాలు మెరుగుపరుస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.