బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 12 జనవరి 2022 (14:26 IST)

జి.కొండూరులో కోడిపందాలు, పేకాటకు భారీ స్కెచ్

కృష్ణా జిల్లా జి.కొండూరు మండల పరిధిలోని చెవుటూరు గ్రామంలో ఓ మామిడి తోటలో కోడి పందేలు, కోతముక్క నిర్వహణకు భారీగా స్కెచ్ వేశారు. కోతముక్క పేరుతో కంప్యూటర్ పేకను వినియోగించి భారీగా ప్రజల సొమ్మును లక్షల రూపాయలు దోచుకోవడానికి వ్యూహం పన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు స్థానిక నాయకులు విజయవాడ సింగ్ నగర్ కు చెందిన కొందరితో కుమ్మక్కై జి.కొండూరు కేంద్రంగా కొత్త ముక్క నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
 
 
 ఈ క్రమంలో సంక్రాంతి సంప్రదాయం  పేరుతో మూడు రోజుల పాటు భారీగా పందాలు వేసేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ సింగ్ నగర్ బ్యాచ్ మాత్రం కోడిపందాలు, పేకాటకు అడ్డుపడితే ఎంతకైనా తెగిస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. చెవుటూరు గ్రామంలో ఈ కోతముక్క మాఫియా గత 5 రోజుల నుంచి మామిడి తోటలో మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. కోడిపందాలు, పేకాట శిబిరం వద్ద చిన్న, చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారి వద్ద నుంచి కూడా వారు వేలాది రూపాయలు వసూలు చేయనున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా బాగానే వుంది కానీ పండుగ ముసుగులో జరిగే అసాంఘిక కార్యకలాపాల నేపథ్యంలో ఎవరికైనా ప్రాణ హాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. 
 
 
గతంలో కోడిపందాలు నేపథ్యంలో ఎన్నో గొడవలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కోడి పందాల నిర్వాహకులు ఇప్పటికే తాము రౌడీషీటర్లమని  ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. తేడా వస్తే లారీలతో, వాహనాలతో తొక్కించి చంపేస్తామని వారు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇక్కడ పేకాట, కోతముక్క, కోడిపందాల నిర్వహణ వెనుక సున్నంపాడు గ్రామానికి చెందిన ఓ రాజకీయ నాయకుని హస్తం ఉన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. సదరు రాజకీయ నాయకుడు రాష్ట్ర స్థాయిలో ఓ మీడియా ప్రతినిధి అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఓ వ్యక్తికి ఇక్కడ జూదం నిర్వహణ అప్పగించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.
 
 
ఇక్కడ జూదం నిర్వహించే వారు ఎన్నో కేసుల్లో ముద్దాయిలుగా పేర్కొంటున్నారు. మరి ముద్దాయిలను స్థానిక రాజకీయ నాయకులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేది ప్రశ్నర్ధకంగా మారింది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే జిల్లా పోలీసు అధికారులు తక్షణమే స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.