పీఆర్పీ దెబ్బతిన్న తర్వాత పార్టీ పెట్టి ఇలా నడపాలంటే... పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా జనసేన పార్టీ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ… పీఆర్పీ దెబ్బతిన్న తర్వాత ఓ పార్టీ స్థాపించి దాన్ని ఇంతదూరం నడిపించడం చాలా కష్టమైన వ్యవహారం. నేను నాయకుల్ని నమ్మి పార్టీ పెట్టలేదు. కేవలం అభిమానులు, సాధారణ కార్యకర్తలని నమ్మే జనసేన పార్టీని స్థాపించా. మనది బలమైన శక్తితో కూడిన సమూహం.
నదీ ప్రవాహంలో ఉన్న కరెంటుని ఏవిధంగా అయితే పవర్‌ప్లాంట్ ద్వారా వెలికి తీస్తామో, మనందరిలోని శక్తినీ అలానే వ్యవస్థ రూపంలోకి తేవాలి. 2014లో పార్టీ స్థాపించినప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు నువ్వేం చేయగలవు అని చాలామంది అడిగారు. నేను ముఖ్యమంత్రి అయిపోవడానికి రాజకీయాల్లోకి రాలేదు. సగటు మనిషి ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వడానికే వచ్చా.
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్క నాయకుడు కూడా మనకి అండగా నోరు విప్పలేదు. గదుల్లో కూర్చుని కోట్ల కుటుంబాలకి పాలసీలు తయారుచేయడం ఎలా సాధ్యం? పొలిటికల్ ప్రాసెస్‌లో సహనం, పట్టుదల కావాలి. కానీ ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి 30 ఏళ్లు సిఎంగా ఉండాలని ఉంది అంటారు. ముఖ్యమంత్రి గారు మరో దశాబ్దంపాటు మేమే ఉండాలంటారు. ముందు సిఎం అవ్వాలంటే మూడు తరాలు బాగుండాలన్న ఆకాంక్ష ఉండాలి. నా దగ్గర ఉన్నది బలమైన ఆశయం, అన్నదమ్ముల అండ మాత్రమే. జనసేన మాతో కలుస్తుందంటే మాతో కలుస్తుంది అని పార్టీలు చాటింపు వేసుకోవడం, తెలంగాణ ఎన్నికల్లో సైతం జనసేన మాతోనే ఉందని ప్రచారం చేసుకోవడం మన బలాన్ని తెలియచేస్తోంది.
2019లో అద్భుతాలు చేస్తామో లేదో తెలియదుగానీ, బలంగా అయితే నిలబడతాం. పార్టీని రాష్ట్రంలో విస్తరింప చేసిన తర్వాతే కమిటీలు వేయాలన్న ఆలోచనతో ఇప్పటివరకు కమిటీలు వేయలేదు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనసేన పార్టీ కార్యకలాపాల కారణంగా పార్టీ బలంగా జనంలోకి వెళ్లిన తరుణంలో ఇప్పుడు కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయం. సంక్రాంతి తర్వాత కమిటీలను నేనే స్వయంగా ఏర్పాటు చేస్తాను. అర్హులైన వారి అందరి వివరాలను సేకరిస్తున్నాను. అందరికీ ఆమోదయోగ్యమైన కమిటీలనే ఏర్పాటు చేస్తాను. ఈ కమిటీల్లో అన్ని వర్గాలకి సమాన ప్రాతినిధ్యం ఉండే విధంగా స్థానిక నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాలి.
స్వచ్చందంగా కార్యకర్తలు ముందుకి వచ్చి పని చేస్తున్న ఏకైక పార్టీ జనసేన మాత్రమే. ఇది మనమంతా గర్వించదగ్గ విషయం. జనసేన కార్యకలాపాల్లో పాల్గొంటున్న కార్యకర్తలు మద్యం బాటిళ్ల కోసమో, బిర్యానీ ప్యాకెట్ల కోసమో వచ్చేవారు కాదు. గుండెల నిండా అభిమానంతో స్వచ్చందంగా వచ్చి పని చేస్తున్నారు. అభివృద్ధి చెందని కులాలను అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చెందిన కులాలని తిట్టనవసరం లేదు. సంకల్ప బలం ఉంటే వెనుకబడిన కులాలని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లవచ్చు. కులాల మధ్య ఐక్యత లేకపోతే మన సమాజం అభివృద్ధి చెందదని పదేపదే చెబుతున్నాను.
కులాల ఐక్యత పట్ల గట్టి విశ్వాసం ఉన్నందునే నేను ఆ విషయాన్ని ప్రతి సభలో చెబుతున్నా. ప్రతి కులంలోనూ మితిమీరిన కులాభిమానం ఉన్నట్టుగానే ఇతర కులాల పట్ల సహనంతో ఉండేవారు కూడా అదే స్థాయిలో ఉన్నారు. అంటువంటి ఇతర కులాల పట్ల సహనంతో ఉన్న వారిని మనం అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరాదు.
2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం అంటే సామాజికంగా ఒక ప్రయోగం చేసినట్టే. ఆ ప్రయోగం విజయం సాధించినందువల్లే జనసేన బలంగా ప్రజల్లోకి దూసుకుపోయింది. ఫలితంగానే ఈ రోజున మనమంతా ఇక్కడ సమావేశం అయ్యాం. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అమరావతి ముందుకి వెళ్లాలన్నా జనసేన పార్టీ అవసరం ఉంది అన్నారు.