బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2024 (10:44 IST)

ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతి.. పవన్ కల్యాణ్ ఆదేశాలు

Olive Ridley Turtles
Olive Ridley Turtles
కాకినాడ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చనిపోయాయని వచ్చిన వార్తలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,  అటవీ - పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్, అటవీ శాఖ సీనియర్ అధికారులను దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ అరుదైన జాతుల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరణాలపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
 
వీటి మరణాలకు గల కారణాలను గుర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మరణాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి వన్యప్రాణుల సంరక్షణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు.
 
కాకినాడ వాకలపూడి ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధపూరిత వాయువులు విడుదల విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. 
 
యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో? లేదో? పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.