శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జులై 2020 (13:09 IST)

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుపై పీఎంవో ఆరా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లుపై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీయడం మొదలుపెట్టింది. సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అలాగే, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేశారు. ఈ రెండు అంశాలకు సంబంధించి బిల్లులు తయారు చేసి వాటిని అసెంబ్లీలో ఆమోదించగా, శాసనమండలి మాత్రం తిరస్కరించింది. 
 
ఈ క్రమంలో మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం పంపించింది. ఈ బిల్లులకు సంబంధించి ప్రస్తుతం గవర్నర్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. 
 
మరోవైరు, ఈ బిల్లులకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న బిల్లుల వివరాలను కోరింది. గవర్నరుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి ప్రధాని కార్యాలయానికి పంపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయాన్ని పీఎంవో వివరాలు అడిగింది
 
ఇదిలావుండగా, ఈ త్రీ క్యాపిటల్స్‌కు ఒక్క అధికార వైకాపా మినహా.. మిగిలిన ఏ ఒక్క పార్టీ అంగీకరించడం లేదు. ఇపుడు మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తున్న జాబితాలో ఆర్ఆర్ఎస్ కూడా చేరిపోయింది. మూడు రాజధానుల బిల్లులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శారదా ట్వీట్ చేశారు. ఆ బిల్లులను తిరస్కరించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
మూడు రాజధానులు అనేది ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందువల్ల ఆ బిల్లును తిరస్కరించాలని ఆయన గట్టిగా కోరారు. ఇప్పటికే, మూడు రాజధానుల బిల్లులు రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాక, శాసనమండలిపై జగన్ పైచేయి సాధించాలనుకుంటున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు. వనరులు వృథా కాకుండా చూడాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.