నర్సుల దినోత్సవం.. దాదిపై సీఐ దాడి - ఖండించిన నేతలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించుకొని తిరిగి ఇంటికి వెళుతున్న ప్రభుత్వ నర్సు హేమలత, ఆమె భర్త అంబులెన్స్ డ్రైవర్ వెంకట్ రాజ్‌పై సిఐ దుర్గాప్రసాద్ వారి సిబ్బంది దాడికి పాల్పడిన సంఘటన దారుణమని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ నర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ మంజులా దేవి, ప్రధాన కార్యదర్శి శివకుమారిలు అన్నారు.
బుధవారం అసోసియేషన్ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సాక్షిగా దంపతులపై బాధ్యత గలిగిన పోలీస్ అధికారులు దాడికి పాల్పడటం దుర్భాషలాడటం అవమానం గురిచేయటం, బాలింతగా ఉన్న నర్సు, ఇంటిదగ్గర పసిబిడ్డను వదలి కోవిడ్ విధులకు హాజరైందని ఈ విషయాన్ని సదరు సిఐకి చెప్పిన అప్పటికీ దారుణంగా భార్య భర్తలపై దాడి చేయడం అవమానకరమన్నారు. ఈ సంఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
డిజీపి గౌతమ్ సవాంగ్ తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ స్పందించి విచారణకు ఆదేశించాలని దాడికి పాల్పడిన సీఐ దుర్గాప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ స్టేట్ ప్రెసిడెంట్ మంజుల దేవి, సెక్రటరీ శివ కుమారి డిమాండ్ చేశారు.