శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (18:29 IST)

ఏపీలో ఆరోగ్య కార్మికులకు ‘ప్రధాని గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ బీమా పథకం’...

అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కోవిడ్-19 బారిన పడిన వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల వర్తింపుతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ బీమా పథకం ప్రారంభించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి సోమ‌వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలను రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి ఆ ప్రకటనలో వివరించారు.

ఈ పథకం కాల వ్యవధి 90 రోజులుగా నిర్ణయించారు. కోవిడ్ -19 (కరోనా) బాధితులకు వైద్య సేవల కోసం వినియోగించే ప్రైవేటు ఆసుపత్రులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, రోజువారీ వేతన ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రుల్లో నియమించిన అడ్-హాక్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు స్వతంత్ర ప్రతిప్రత్తి కలిగిన కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆసుపత్రుల ఉద్యోగులందరికీ ప్రధానమంత్రి కళ్యాణ్ బీమా పథకం వర్తింపజేస్తారు.

వారితో పాటు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లు, ఐ.ఎన్.ఐ, కేంద్ర మంత్రిత్వ శాఖల ఆసుపత్రులు ఉద్యోగులతో పాటు విశ్రాంత ఆరోగ్య శాఖ ఉద్యోగులు, వలంటీర్లకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన  సంఖ్య మేరకు ఈ బీమా వర్తింప చేస్తారు.

కోవిడ్ వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తూ ప్రమాదవశాత్తు కోవిడ్ -19 బారిన పడి మరణించిన వారికి కూడా ఈ బీమా పథకం వర్తిస్తుంది. ఇతర బీమా సదుపాయలు ఉన్నప్పటికీ ఈ పథకం అదనంగా వర్తిస్తుంది.