వై.ఎస్ జగన్ ఓ లయన్ కింగ్... ఆయనకి రుణపడి ఉంటాం: పూరి జగన్నాథ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. తన మనోభావాలను ఈవిధంగా పంచుకున్నారు.
‘‘ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు నేను వైజాగ్‌లో ఉన్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి టీవీలో రిజల్ట్స్ చూస్తున్నాం. ఎందుకంటే నా తమ్ముడు ఉమా శంకర్ గణేష్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఫలితాలు ఎంతో టఫ్‌గా ఉంటాయని ఊహించిన మాకు వార్ వన్ సైడ్ అయ్యేసరికి మతిపోయింది. ఏపీ ప్రజలందరూ సీక్రెట్‌గా మీటింగ్ పెట్టుకుని జగన్‌నే ఎన్నుకుందాం అని కూడబలుక్కొని ఓట్లు వేసినట్లు అనిపించింది.
ఇన్ని కోట్లమంది ఒకేసారి ఒక మనిషిని నమ్మటం, అతను వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం చిన్నవిషయం కాదు. హ్యాట్సాఫ్ టు జగన్ మోహన్‌రెడ్డి గారు. జగన్ మోహన్‌రెడ్డి గారు చేసింది ఒకరోజు ఎలక్షన్ కాదు. పదేళ్ల యుద్ధం. ఒళ్లంతా గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా, శక్తిని కోల్పోకుండా తన సైనికుల్లో ఉత్సాహం నింపుతూ, రాజన్న ఎత్తున్న తల్వార్ పట్టుకుని పదేళ్ల పాటు రణరంగంలో నిల్చున్న యోధుడు జగన్.
విజయం సాధించిన తర్వాత ఆయన మాట్లాడిన వీడియో చూశాను. ఆయన ముఖంలో విజయగర్వం లేదు. ప్రశాంతంగా ఉన్నాడు. రాజన్న కుమారుడు అనిపించుకున్నాడు. వై.ఎస్.జగన్ ఒక వారియర్. దైవ నిర్ణయం, ప్రజానిర్ణయం వల్ల ఈ విజయం వచ్చిందని ఆయన తన మాటల్లో చెప్పాడు.
కానీ ప్రజానిర్ణయం దైవనిర్ణయం కంటే గొప్పదని నేను నమ్ముతాను. ప్రజలను మార్చడంలో దేవుడు ఎప్పుడో ఫెయిల్ అయ్యాడు. కాని ప్రజలు తలుచుకుంటే దేవుడ్ని మార్చగలరు. ప్రజలంతా సమైక్యంగా జగన్‌గారికి మొక్కేశారు. నా తమ్ముడికి జగన్‌గారంటే ప్రాణం. ఆయన ఫొటో చూసినా, వీడియో చూసినా ఎగ్జయిట్ అవుతాడు. ఓ సూపర్‌స్టార్‌లా చూస్తాడు. వాడు అలా ఎందుకు చూస్తాడో నాకిప్పుడు అర్థమవుతోంది.
గత ఎన్నికలలో నా తమ్ముడు ఓడిపోయినా, భుజం తట్టి, చేయి పట్టుకుని మళ్లీ యుద్ధంలోకి లాక్కెళ్లి ఇంతటి విజయాన్ని వాడికి అందించిన జగన్ మోహన్‌రెడ్డి గారికి నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం. నేను రాజకీయాలలో లేను. కానీ నాకు పోరాట యోధులంటే ఇష్టం. నా దృష్టిలో జగన్ అంటే ఒక లయన్ కింగ్ అన్నారు పూరి జగన్నాథ్..!