శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2024 (14:32 IST)

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట : మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు!!

nadendla manohar
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టిసారించారు. కాకినాడ - ముంబై రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు చేయించి, ఆరు లారీల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అలాగే, కాకినాడ పోర్టు పీఎస్ వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని మంత్రి నాదెండ్ల ఆదేశించారు. 
 
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం ఇతర దేశాలకు రవాణా అవుతున్నట్లుగా గుర్తించారు. కాకినాడలో గోడౌన్‌లలో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేయించారు.
 
కాకినాడ పోర్టు కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఎనిమిది విభాగాల పర్యవేక్షణలో చెక్ పోస్టులను ఏర్పాటుచేయించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి ముంబై రోడ్డులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక్క రోజునే ఆరు లారీల్లో బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 
 
కాకినాడ పోర్టు పీఎస్ వద్ద మరో చెక్ పోస్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ రేషన్ మాఫియా దందా సాగిస్తోందని ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.