రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల హస్తం : మంత్రి నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు అందించే రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలి వెల్లడంతో ఐదుగురు ఐపీఎస్‌లు తమ వంతు పాత్ర పోషించారని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన ఇటీవల కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన బియ్యం గోదాముల్లో తనిఖీ చేయగా, అక్రమంగా నిల్వవుంచిన వేల టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి, ఆ గోదాములను సీజ్ చేశారు. ఈ అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందన్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ... ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హోల్ సేల్ దుకాణదారులు, రిటైల్ వర్తకులు కూడా రూ.160కే నాణ్యమైన కిలో కందిపప్పును అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్ముందు పంచదార సహా పలు చిరుధాన్యాలను కూడా రైతు బజార్లలో రాయితీపై విక్రయిస్తామని తెలిపారు. ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, 5 కిలోల బియ్యం చొప్పున అందిస్తామన్నారు. ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు.