1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (12:14 IST)

చంద్రబాబును కలిసేందుకు వచ్చిన ఆ ఇద్దరు ఐపీఎస్‌లు.. అనుమతి నిరాకరణ

kolli raghurami reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారుల్లో ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల, మరో సీనియర్ అధికారి కొల్లి రఘురామిరెడ్డిలు ఉన్నారు. వీరిద్దరిని పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని నివాసం వద్దకు ఆయన చేరుకోగా అనుమతి లేదని చెప్పారు.
 
ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను ఎన్నికల విధుల నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) తప్పించింది. ఆ తర్వాత అనధికారికంగా కూడా వైకాపా కోసం ఆయన తనవంతు పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో ప్రధాన గేటు వద్దే కానిస్టేబుళ్లు పీఎస్‌ఆర్‌ కారును ఆపారు. లోపలికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు.
 
అలాగే, మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి అనుమతి నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు ఫోన్‌లో అధికారులను ఆయన అనుమతి కోరగా తిరస్కరించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసే సమయంలో రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వైకాపాకు వీరవిధేయుడిగా ఉన్నారంటూ ఈసీ ఆయనపై కొరడా ఝుళిపించింది. డీజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో గత ఐదేళ్లుగా అధికార వైకాపాతో అంటకాగిన సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల మున్ముందు ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోతున్నారు.