ఏపీలో కరోనా వైరస్ విశ్వరూపం : 2 నుంచి 11 శాతం పెరిగిన కేసులు

apcorona
ఠాగూర్| Last Updated: సోమవారం, 13 జులై 2020 (15:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ అనేక మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఫలితంగా వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీల మధ్య నమోదైన కొత్త కేసులను పరిశీలిస్తే, కొత్త కరోనా కేసుల నమోదులో 11 శాతం వృద్ధి కనిపించింది.

ఈ నెల 1న ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం జులై 30న 28,239 మందికి పరీక్షలు నిర్వహించగా 611 మందికి.. అంటే 2.3శాతం పాజిటీవ్ వచ్చింది. శనివారం 17,624 మందికి టెస్టులు చేయగా 1914 మందికి.. అంటే 11 శాతం వైరస్ నిర్ధారణ అయింది.

కేందప్రభుత్వం గణాంకాల ప్రకారమే ఏపీలో సగటున రోజుకు కొత్త కేసుల పురోగతి 8 శాతంపైనే ఉంటోంది. గత మూడు రోజుల లెక్కలు పరిశీలిస్తే ఇది 11 శాతానికి పెరిగిపోయింది. ఇది ప్రమాదకర పరిస్థితి అని, కరోనా ఉధృతి కొనసాగుతుండడంవలనే కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

డిప్యూటీ సీఎంకు కరోనా
తాజాగా డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు కరోనా సోకింది. శుక్రవారం నాడు ఆయన కరోనా రావడంతో తిరుపతిలో స్విమ్స్‌లో చేరారు. అంతకు మునుపు కడపలోని రిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. కార్డియో థోరాసిక్ సమస్యలు ఉండటంతో తిరుపతి స్విమ్స్‌కు రిమ్స్ వైద్యులు రెఫర్ చేశారు. ఆదివారం రాత్రి వరకు స్విమ్స్‌లో అంజద్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు చికిత్స తీసుకున్నారు.

ఈ విషయమై స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ మీడియాతో మాట్లాడారు. "అంజద్ బాషాకు కరోనా సోకింది. కోవిడ్ లక్షణాలు ఏవీ ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు లేవు. గతంలో ఆయనకు ఉన్న కార్డియో థోరాసిక్ సమస్య వల్ల కోవిడ్ సమస్య తీవ్రమవుతుందనే ముందు జాగ్రత్తగా స్విమ్స్‌లో చేరారు.

కార్డియో థోరాసిక్ సమస్యలు కనిపించలేదని స్విమ్స్ వైద్యులు చెప్పటంతో, ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్‌తో చర్చించి ఆయన హైదరాబాద్‌కు వెళ్లారు" అని వెంగమ్మ వెల్లడించారు. అయితే, పాజిటివ్ అని తేలడంతో డిప్యూటీ సీఎం అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.దీనిపై మరింత చదవండి :