గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జులై 2020 (11:15 IST)

తిరుపతిలో మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు.. ఎందుకంటే?

కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఏపీలో పలుచోట్ల నిబంధనలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతోంది. కంటెన్మైంట్ జోన్లలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు సూచిస్తోంది. తాజాగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి తిరుపతిలో మధ్యాహ్నం రెండు గంటల వరకే వ్యాపార దుకాణాలు తెరిచి ఉంచాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించింది. 
 
ఆదివారం జరిగిన సమావేశంలో అధ్యక్షుడు మంజునాథ్‌ మాట్లాడుతూ.. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో స్వచ్ఛందంగా దుకాణాలను మూతవేయాలని తీర్మానించినట్లు చెప్పారు. అలాగే వ్యాపారులకు అండగా ఉంటామని చెప్పారు. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా టెస్టుల సంఖ్య పెంచిన తర్వాత కోవిడ్ పాజిటివ్ కేసులు సైతం భారీగానే నమోదవుతున్నాయి. మరోవైపు గత నెలలో శ్రీవారి ఆలయం తెరుచుకున్న తర్వాత చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా ప్రభావం తీవ్రమైంది. దీంతో తిరుపతిలో కొన్ని మార్పులు ఉండబోతున్నాయి.
 
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలను మూసివేయాలని తిరుపతి వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నాయి. కేవలం మెడికల్, వైద్య సంబంధిత షాపులు మాత్రమే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తెరిచి ఉంటాయని, ఇతరత్రా దుకాణాలు మూసివేయాలని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. తప్పనిసరి పనులుంటేనే ప్రజలు ఇళ్ల నుంచి బటయకు రావాలని అధికారులు సైతం సూచిస్తున్నారు.