ఉప్పొంగుతున్న కృష్ణా, భీమా నదుల... మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్
కృష్ణా, భీమా నదులు ఉప్పొంగుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను వణికిస్తున్నాయి. నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. అనేక గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పంటపొలాలు, తోటలు, రహదారులు అన్ని జలమయమయ్యాయి. ఎగువ నుంచి వరద మరింత పెరుగుతుండడంతో ముంపు ముప్పున్న గ్రామాలు ఖాళీ చేయించి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
రెండు నదులు పొంగుతుండడంతో తీరం వెంట ఊళ్లు, పొలాలు, ఆలయాలు నీట మునుగుతున్నాయి. నారాయణపేట, గద్వాల, వనపర్తి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వనపర్తి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి నిరంజన్‍రెడ్డి పరిశీలించారు. నారాయణపేట, గద్వాల జిల్లా కలెక్టర్లు వెంకట్‍రావు, శశాంక్ తీర ప్రాంతాల వెంటే ఉంటూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
కృష్ణానది ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో నారాయణపేట, గద్వాల జిల్లాలోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. మరికొన్ని గ్రామాలు ముందస్తుగా ఖాళీ చేయించారు. ఆదివారం నారాయణపేట జిల్లాలోని హిందూపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనిలోకి వరద నీరు చేరింది. వారికి అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడిలో పునరావాసం కల్పించారు. భోజనాలు, దుప్పట్లు అందజేశారు.
కృష్ణా-హిందూపూర్ రోడ్డు నీట మునగడంతో కృష్ణా, తంగిడి, కురుమూర్తి, గురజాల గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కృష్ణా, భీమా నదుల సంగమం ప్రాంతం తంగిడి వద్ద పరిస్థితి భయానకంగా మారింది. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ముడుమాల, మురార్‍దొడ్డి గ్రామాల మధ్య రోడ్డు నీట మునిగింది. రాకపోకలు బంద్ అయ్యాయి. వనపర్తి జిల్లా రాంపూర్ వద్ద చేపలచెరువులో చిక్కుకున్న ఇద్దరిని రెస్క్యూ టీమ్ కాపాడింది.