సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (14:21 IST)

గుంటూరు జిల్లాలో 866 గ్రామ సచివాలయాలు

ఏపీలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల సేవలను వీటి నుంచే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయాల వ్యవస్థ కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 866 సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. 
 
2 వేల నుంచి 4 వేల జనాభా ఉన్న ప్రాంతంలో వీటిని ప్రతిపాదించారు. జిల్లావ్యాప్తంగా 549 పంచాయతీ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు 265 చిన్న పంచాయతీల్లో గ్రామ సచివాలయాలను నెలకొల్పుతున్నారు. చిన్న పంచాయతీలు 2-3 గ్రామాలను కలిపి 2వేల నుంచి 4వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒక పంచాయతీని కేంద్రంగా ఎంపిక చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చిన్న పంచాయతీల్లో ఇంకా 52 గ్రామ సచివాలయాలను ఎంపిక చేయాల్సివుంది.
 
ప్రభుత్వ సేవలు నేరుగా ప్రజలకు... 
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సేవలను నేరుగా వారి ఇంటికి అందజేయడమే సచివాలయాల ఏర్పాటు లక్ష్యం. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్‌ను నియమిస్తున్నారు. ఈ వలంటీర్‌ రోజూ తన పరిధిలోని 50 గృహాలకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకుంటారు. వాటిని గ్రామ సచివాలయంలో అధికారుల దృష్టికి తెస్తారు. ఉదాహరణకు ఒక ఇంటిలో ఓటరు గుర్తింపు కార్డు కావాల్సి ఉంటే... ఆ ఓటరు నెంబర్‌, ఫొటో అందజేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తారు. 
 
ఈ వివరాలను సెల్‌కు మేసేజ్‌ రూపంలో అందిస్తారు. ఓటరు మీ సేవా కేంద్రానికి వెళ్లి ఓటరు గుర్తింపు కార్డును పొందాల్సివుంటుంది. ఈ విధంగా ప్రజల అవసరాలకు, గ్రామ సచివాలయానికి మధ్య వలంటీర్‌ అనుసంధానకర్తగా ఉంటారు. 
 
సచివాలయాల్లో ఉండే సిబ్బంది... 
ఏఎన్‌ఎం, పశు సంవర్థక శాఖ ఉద్యోగి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధి, వీఆర్వో, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్‌ సిబ్బంది, ఎలక్ట్రికల్‌ సిబ్బంది, వ్యవసాయ శాఖకు సంబంధించిన ఎంఈవో, విద్యాశాఖ ప్రతినిధి, సంక్షేమ శాఖల ఉద్యోగి, డిజిటల్‌ అసిస్టెంట్‌.
 
ఎలాంటి సేవలు
పెన్షన్‌లు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, రేషన్‌ కార్డులు, విద్యార్థుల ఉపకార వేతనాలు, రైల్వే, ఆర్టీసీ టిక్కెట్ల రిజర్వేషన్‌, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డులు, పల్స్‌ సర్వే, విద్యుత్‌, టెలిఫోన్‌ బిల్లులు, ఇంటి పన్నుల చెల్లింపు, రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, డ్వాక్రా సంఘాలకు బ్యాంక్‌ల ద్వారా రుణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌), బ్యాంకుల్లో పంట రుణాలు, పంటల బీమా పథకంలో పేరు నమోదు, పాస్‌పోర్ట్‌ దరఖాస్తులు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, ఓటరు గుర్తింపు కార్డులు, బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభం, తదితర సేవలు అందిస్తారు. 
 
జిల్లాలో గ్రామీణ జనాభా సంఖ్య : 35,17,052
గ్రామ పంచాయతీల సంఖ్య : 1,029
గ్రామ సచివాలయాల సంఖ్య : 866
పంచాయతీ కేంద్రాల్లో సచివాలయాల సంఖ్య : 549
ఇప్పటివరకు గుర్తించిన సచివాలయాల సంఖ్య: 814
 
అన్ని సేవలు సచివాలయం నుంచే...
ప్రభుత్వ సేవలన్నీ గ్రామ సచివాలయాల నుంచే అందిస్తాం. ఇప్పటికే వలంటీర్ల ఎంపిక పూర్తి అయింది. వారంలోపు వలంటీర్లకు శిక్షణ ఇస్తాం. సచివాలయాల సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. జిల్లాలో ఇంకా 52 సచివాలయాలను ఎంపిక చేయాల్సివుందిని జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాశ్‌ వెల్లడించారు.