బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యూహం: ముద్రగడతో ఆర్ఎస్ఎస్ నేత భేటీ
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతో ఆర్ఎస్ఎస్ నేత ఆలే శ్యామ్ కుమార్ భేటీ కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్యామ్ కుమార్ గురువారం కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చారు.
కాపు ఉద్యమ నాయకులను ముద్రగడ పద్మనాభం శ్యామ్ కుమార్‌కు పరిచయం చేశారు. కిర్లంపూడిలోని భారతీయ విద్యా కేంద్రానికి చెందిన విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలకు వచ్చిన సందర్భంగా శ్యామ్ కుమార్ ముద్రగడను మర్యాదపూర్వకంగానే కలిశారని బీజేపీ నేతలు అంటున్నారు.
ముద్రగడ, శ్యామ్ కుమార్ తమ భేటీలో కొంత సేపు మాట్లాడుకున్నారు. వారు ఏం మాట్లాడుకున్నారనేది తెలియరాలేదు. అయితే రాష్ట్రంలోని కాపుల పరిస్థితిపై, వారికి గతంలో ఉన్న రిజర్వేషన్లపై, తర్వాత వాటి తొలగించిన తీరుపై ముద్రగడ శ్యామ్ కుమార్‌కు వివరించారు. కాపు రిజర్వేషన్లపై తాను ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖపై కూడా ముద్రగడ ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది.
శ్యామ్ కుమార్‌తో పాటు రాజమహేంద్రవరం విభాగ్ ప్రచారక్ లక్ష్మణ్ జీ, బీజేపీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్ తోట సర్వారాయుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కుమార్, కాపు ఉద్యమ సిద్ధాంతకర్త నల్ల విష్ణుమూర్తి, స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే, బీజేపీ వ్యూహంలో భాగంగానే శ్యామ్ కుమార్ ముద్రగడతో భేటీ అయినట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు అవసరమైన వ్యూహాన్ని రచించి, అమలు చేస్తోంది. ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. ఈ స్థితిలో ఆయనను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ జరిగినట్లు ప్రచారం సాగుతోంది.
ఈబీసీ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని గత ముఖ్యమత్రి నారా చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని కోరుతూ ముద్రగడ ఇటీవల నరేంద్ర మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.