గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (08:04 IST)

దుర్గగుడిలో 22 నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు

విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ప్రతిఏటా ఆషాడం, శ్రావణ మాసాల్లో వైభవంగా నిర్వహించే శాకాంబరీ, అమ్మవారికి ఆషాడ సారె సమర్పణ, శ్రావణ మాసోత్సవాలను ఈ ఏడాది కూడా యథావిధిగా నిర్వహించేందుకు దుర్గగుడి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

వచ్చేనెల 22 నుంచి 24 వరకు అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. గత నెల రోజులుగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం కర్ఫ్యూ నిబంధనలను సడలించడం, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అమ్మవారి సన్నిధిలో ఆషాడ, శ్రావణ మాసోత్సవాలు నిర్వహించే అంశంపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ ఆలయ వైదిక కమిటీ సభ్యులు, పరిపాలన, ఇంజనీరింగ్‌, పూజల విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్నందున కొవిడ్‌ నిబంధనలను పక్కా అమలు చేస్తూ, భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. గత ఏడాది కూడా కొవిడ్‌ నిబంధనల నడుమ దుర్గగుడిలో శాకాంబరీదేవి ఉత్సవాలు, ఆషాఢ, శ్రావణ మాసోత్సవాలను నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా ఆయా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఈవో సూచించారు.