విశాఖ మన్యంలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోల మృతి?
గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు కాల్పులు చోటుచేసుకున్నాయి. విశాఖ మన్యంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద బుధవారం ఈ ఎదురు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో మంప పోలీస్‌స్టేసన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
అయితే ఎదురు కాల్పుల్లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారన్న దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. సంఘటనా స్థలం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియడానికి కాస్త సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఘటనాస్థలిలో ఏకే- 47 తుపాకులు లభ్యమయ్యాయి. ఈ ఘటన తర్వాత మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.