1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (10:40 IST)

గడ్చిరోలిలో ఎదురుకాల్పులు : 13 మంది మావోయిస్టుల మృతి?

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 13 మంది వరకు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
నిజానికి దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. దీంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం భారీ‌ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలోవద్ద సీ-60 యూనిట్‌ మహారాష్ట్ర పోలీసులకు, మావోయిస్టులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. 
 
అయితే, పోలీసుల కాల్పుల్లో ఏకంగా 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు కొనసాగుతుండటంతో ప్రస్తుతం గడ్చిరోలి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. 
 
కాగా, పెద్ద ఎత్తున మావోయిస్టులు మృతి చెందడంతో దండకారణ్యం నెత్తురోడింది. ధనోరా తాలుకా కోట్మీ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడినట్టు సమాచారం. ప్రస్తుతం ఏటపల్లిలో ఏరియాలో పోలీసులు గాలింపు చర్యలు, కూంబింగ్ కొనసాగిస్తున్నారు.