సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (15:11 IST)

ఐపీఎల్ టోర్నీకి భువనేశ్వర్ దూరం : తెలుగు కుర్రోడికి లక్కీఛాన్స్!!

యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొంటున్న ఫ్రాంచైజీ జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకటి. ఈ జట్టులోని కీలక బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకరు. అయితే, భువనేశ్వర్‌కు మరోమారు దురదృష్టం వెంటాడింది. ఫలితంగా ఈ బౌలర్ ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. 
 
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో తొడ కండరాల గాయానికిగురైన సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ మొత్తానికి వైదొలిగాడు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం నిర్ధారించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.
 
గాయంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడని, అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని అందులో పేర్కొంది. అదేసమయంలో ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లలో భువీ స్థానాన్ని పృథ్వీరాజ్ యర్రాతో భర్తీ చేస్తున్నామని సన్ రైజర్స్ అధికారికంగా ప్రకటించింది. 
 
కాగా, పృథ్వీరాజ్ యర్రా ఓ తెలుగు క్రికెటర్. రంజీల్లో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 22 ఏళ్ల పృథ్వీరాజ్ ప్రధానంగా ఫాస్ట్ బౌలర్. 2017లో దేశవాళీ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం పేస్ బౌలర్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు.
 
2020 సీజన్ ఆరంభంలో ఒంగోలులో జరిగిన దేశవాళీ మ్యాచ్‌లలో సౌరాష్ట్రపై 3, కేరళపై 6, హైదరాబాద్ జట్టుపై 6 వికెట్లు సాధించి సత్తా చాటాడు. ఇప్పటివరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పృథ్వీరాజ్ 39 వికెట్లు తీశాడు. 
 
పృథ్వీరాజ్ స్వస్థలం గుంటూరు జిల్లా దుగ్గిరాల. పృథ్వీ ఐపీఎల్ గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కోల్‌కతా జట్టు అతడ్ని రిలీజ్ చేయగా, వేలంలో సన్ రైజర్స్ దక్కించుకుంది.