సోమవారం, 24 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 నవంబరు 2025 (14:16 IST)

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

brgavai - cji car
భారత సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వచ్చే 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగుతారు. కొత్త ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్, పలువురు కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం మాజీ సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ తాను వచ్చిన అధికారిక కారును కొత్త సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ కోసం రాష్ట్రపతి భవన్‌ వద్ద వదిలివెళ్లినట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం సీజేఐగా పదవీవిరమణ చేసిన అనంతరం మాజీ సీజేఐలు తాము ఉంటున్న అధికారిక నివాసాలను, సీజేఐకి ప్రభుత్వం ఇచ్చే ఇతర సౌకర్యాలను వీడాల్సి ఉంటుంది. 
 
అందులోభాగంగానే జస్టిస్‌ గవాయ్‌ కారును సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ కోసం రాష్ట్రపతి భవన్‌ వద్ద వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. అయితే జస్టిస్‌ సూర్యకాంత్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే జస్టిస్‌ గవాయ్‌ కారును అక్కడే వదిలివేయడం గమనార్హం. కాగా, ఈ యేడాది మే 14వ తేదీన 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ పదవీకాలం ముగియడంతో సోమవారం నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం చేసిన విషయం తెల్సిందే. 
 
దీంతో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా  వాసిగా రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాజీ సీజేఐ జస్టిస్‌ గవాయ్‌, కేంద్రమంత్రులు, ఇతరులు పాల్గొన్నారు.