సోమవారం, 24 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

agitation delhi
దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులపై కొందరు ఆందోళనకారులు పెప్పర్ స్ప్రేతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలుసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ పెప్పర్ స్ప్రే దాడిని అసాధారణం చర్యగా పోలీసులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఇటీవల ఏపీలో జరిగిన ఎన్‌కౌంటరులో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా పోస్టర్లను కూడా ప్రదర్శించడం కలకలం రేపింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కొందరు ఆందోళనకారులు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే, ఇక్కడ ఆందోళన చేసేందుకు అనుమతి లేదని, అందువల్ల జంతర్ మంతర్ వద్ద చేసుకోవాలని వారికి పోలీసులు సూచించారు. అయితే, ఆందోళనకారులు ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ బైఠాయించారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కొందరు నిరనసకారులు పెప్పర్ స్ప్రేను ప్రయోగించారు. 
 
ఈ దాడిలో కొందరు పోలీసులు గాయపడ్డారు. వారిని వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులపై ఆందోళనకారులు పెప్పర్ స్ప్రే ప్రయోగించడం ఇదే తొలిసారి. ఇది అసాధారణ చర్యగా ఢిల్లీ పోలీసులు పేర్కొంటూ, ఈ ఆందోళనలో పాల్గొన్నవారిలో 15 నుంచి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, ఆదివారం ఢిల్లీ వాయుకాలుష్యం అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 391గా నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకరమైన కేటగిరీగా నిపుణులు పేర్కొంటున్నారు.