Pushpa 2 Pepper Spray: పుష్ప-2 అరాచకాలు.. పెప్పర్ స్ప్రే చల్లింది ఎవరు? (video)
Pushpa 2 Pepper Spray: పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే థియేటర్ యాజమాన్యంతో పాటు నటుడు అల్లు అర్జున్‌పై పోలీసు కేసు నమోదయ్యింది.
ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మానవహక్కుల కమిషన్‌కు లాయర్ రామారావు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను ఎన్‌హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించి.. త్వరలోనే దర్యాప్తు చేపట్టనుంది. ఇలాంటి ఘటనలో పలు సినిమా థియేటర్లలో జరుగుతోంది. ఫ్యాన్స్ దురుసుగా ప్రవర్తిస్తూ ఓవరాక్షన్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ముంబై - బాంద్రా ఏరియాలో ఉండే గెలాక్సీ థియేటర్‌లో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తూ ఉండగా ఇంటర్వెల్ సమయంలో గుర్తు తెలియని దుండగులు పెప్పర్ స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు ఊపిరి ఆడక, దగ్గుతో థియేటర్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ స్ప్రే చేసింది ఎవరు అనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టినట్లు చెప్పారు. థియేటర్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదును బాంద్రా పోలీసులు నమోదు చేశారు.