సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు... కొల్లు రవీంద్ర
అమరావతి: సమాజాన్ని పెద్దఎత్తున ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలను సాధించగలుగుతామని రాష్ట్ర క్రీడలు, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నేటి ఆధునిక సమాచార ప్రపంచంలో సోషల్ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా యువత సోషల్ మీడియాపై ఆధారపడి ఉన్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నేతృత్వంలో విజయవాడ వేదికగా జరుగుతున్న సోషల్ మీడియా సమ్మిట్ తొలిరోజు కార్యక్రమం ఇక్కడి వన్‌ప్లస్‌లో ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో రవీంద్ర మాట్లాడుతూ భవిష్యత్ తరాల్లో ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియా వినియోగం మరింత కీలకంగా మారనుందని, ప్రతి చోటా మంచిచెడూ ఉన్నట్లుగానే సోషల్ మీడియాలోనూ మంచిచెడులకు చోటుందని, ఈ నేపధ్యంలో పర్యాటక శాఖ నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. ప్రపంచం నలుమూలలా ఎక్కడ ఏది జరిగినా సెకన్ల వ్యవధిలో అది అందరికీ చేరిపోతుందని అది సోషల్ మీడియా నెట్‌వర్క్ వల్లే సాధ్యం అయ్యిందన్నారు.
సదస్సులో కీలకోపన్యాసం చేసిన ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటి ముఖ్య కార్యనిర్వహణ అధికారి హిమాన్హు శుక్లా ముఖ్యంగా నేటి యువతకు ఇంటర్నెట్ అధారిత సోషల్ మీడియా నిత్యవసర వస్తువులా మారిపోయిందని, పలువురు యువత సోషల్ మీడియా సేవలను ఉపయోగించుకుంటుంటే మరికొందరు మాత్రం తమ విలువైన సమయాన్ని నిరుపయోగంగా ఖర్చుచేసేందుకు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
ఆంధ్రప్రదేశ్ యువత సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవటం ద్వారా ఉన్నతిని సాధించాలన్న లక్ష్యం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఈ తరహా సమ్మిట్ ఆవశ్యకతను గుర్తు చేస్తూ జాతీయ స్ధాయిలో మనమే ప్రారంభించాలని స్పష్టం చేసారని, ఆ క్రమంలోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగిందన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ సోషల్ మీడియా లేకుంటే గంట గడిచేది ఏలా అన్న తీరుగా వ్యవస్ధ తయారైందన్నారు. కొన్ని సందర్భాలలో చోటుచేసుకునే అప్‌డేట్స్ ఆసక్తిని కలిగిస్తున్నప్పటికీ, మరి కొన్ని సందర్భాలలో జరుగుతున్న అసత్య ప్రచారం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. సమాచారాన్ని త్వరితగతిన అందిపుచ్చుకోగలగటం వల్ల సమస్యలను వేగంగా పరిష్కరించగలుగుతామని, రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వినియోగంలో అగ్రస్ధానంలో ఉందని వివరించారు.
సోషల్ మీడియా సమ్మిట్‌లో భాగంగా వివిధ రంగాల్లోని ప్రముఖులు మాట్లాడటం విశేషం. మాజీ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ క్రీడల్లో సోషల్ మీడియా పాత్రపై ప్రసంగించారు. సామాజికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై ప్రముఖ బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ప్రసంగించారు. పర్యాటక రంగంపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది అన్న దానిని ఏపీ టూరిజం అథారిటీ సీఈవో హిమాన్షుశుక్లా సాదోహరణంగా వివరించారు. సోషల్ మీడియా వల్ల ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అంతర్జాతీయ స్దాయిలో ప్రచారం పొందగలుగుతుందన్నారు. భవిష్యత్తులో సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి మార్పు భారతదేశంలో రాబోతోందనే విషయంపైనా పలువురు వక్తలు మాట్లాడగా, వారిలో పలువరు సినీ తారలు, సామాజిక వేత్తలు ఉన్నారు. తొలి రోజు 15మంది ప్రముఖులు సదస్సులో పాల్గొని సోషల్ మీడియా ప్రభావంపై ప్రసంగిస్తారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వివిఎస్ లక్ష్మణ్
ప్రముఖ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తొలి రోజు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్ధులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వారిని ఔన్సర్లు నిలువరించ వలసివచ్చింది. క్రీడా రంగంలో సోషల్ మీడియా ప్రత్యేక పాత్రను పోషిస్తుందన్నారు. ఎపిటిఎ సిఇఓ హిమాన్హు శుక్లా రాష్ట్రంలో పర్యాటక రంగ పరంగా ఇటీవల చోటు చేసుకున్న నూతనత్వాన్ని గురించి లక్ష్మణ్‌కు వివరిస్తూ తమ అతిధిగృహాలను సందర్శించాలని ఆహ్వానించారు.
సోషల్ మీడియా సమ్మిట్‌లో రెండో రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుండగా, పర్యాటక శాఖ విశేష ఏర్పాట్లు చేసింది. ఇందిరాగాంధీ క్రీడామైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో సోషల్ మీడియాలో రాణిస్తున్న 40 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా అవార్డులు అందజేయనున్నారు. ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎపిటిఎ అధికారులు శుక్రవారం సాయంత్రం మరోసారి పరిశీలించారు. ముఖ్యమంత్రి, ప్రముఖులు హాజరవుతున్నందున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.