శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 26 అక్టోబరు 2018 (21:49 IST)

ఏపీలో జగన్ భుజంపై చిన్న గాయం... తెలంగాణ వెళ్లేసరికి పెద్దదైంది ఎలా?: మంత్రి గంటా

అమరావతి: తనపై దాడి తరవాత ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలకుని జగన్ ఆడిన నాటకం ఫెయిలయ్యిందని, దీంతో ఆయన సెల్ప్ గోల్ చేసుకున్నట్లయిందని రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఏపీ పోలీసులకు కాకుండా తెలంగాణ పోలీసులకు స్టేట్మెంట్ ఇస్తానని జగన్ చెప్పడం ఆంధ్రులను అవమానించడమేనన్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం ఎదుట శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
జగన్ పైన దాడి అనంతర పరిణామాలపై వైసీపీ నేతలు మాట్లాడుతున్న విషయాలు బాధాకరంగా ఉన్నాయని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబునాయుడు దాడిని ఖండించారన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారన్నారు. కేంద్రానికి చెందిన సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో జగన్ పైన దాడి జరిగిందన్నారు. సంఘటన జరిగిన ప్రాంతం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా బాధ్యత తీసుకుంటుందని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. 
 
బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడును, డీజీపీని విమర్శిస్తున్న వారిని చూస్తుంటే, దెయ్యాలు వేదాలు వళ్లిస్తున్నట్లుందన్నారు. బాంబు సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసన్నారు. 3 వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసినా ప్రజలు పట్టించుకోవడంలేదని ఆవేదన జగన్‌లో ఉందన్నారు. అందుకే కొత్తరకం నాటకానికి వైసీపీ నేతలు తెరతీశారన్నారు. నాటకం రక్తి కట్టించడంలో ఫెయిలయ్యి, జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్నారు. దాడి జరిగిన వెంటనే విశాఖ అపోలో వైద్యులు జగన్‌కు ప్రాథమిక చికిత్స చేశారన్నారు. ఒక్క కుట్టు కూడా వేయలేదన్నారు. జగన్ భుజంపై 0.5 సెం.మీ.ల మాత్రమే గాయమైందని వైద్యులు రిపోర్టు ఇచ్చారన్నారు. హైదరాబాద్ వెళ్లిన తరవాత జగన్ గాయం సైజు పెరిగిపోయిందన్నారు. 9 కుట్లు వేశారన్నారు. 
 
జగన్ పైన జరిగిన దాడిని సీఎం చంద్రబాబునాయుడుపై నెట్టేయాలని చూశారన్నారు. అది సఫలీకృతం కాలేదని, ప్రజలంతా గమనిస్తున్నారని మంత్రి తెలిపారు. దాడి తరవాత నిందితుడి జేబులో లేఖ లేదని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. దాడి చేసిన నిందితుడితో పాటు సీఐఎస్ఎఫ్ అధికారులు కూడా లేఖ ఉందని చెప్పారన్నారు. ఘటనపై ఏపీ పోలీసులకు జగన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్నారు. ఏపీ పోలీసులకు కాకుండా తెలంగాణ పోలీసులక జగన్ స్టేట్మెంట్ ఇస్తామనడం ఆయన ఆత్మహత్యాసదృశ్యమన్నారు. 
 
శాంతిభధ్రతలకు భంగవాటిల్లేలా చేసి,  రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను వైసీపీ నేతలు కోరుకుంటున్నారన్నారు. జగన్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు సీరియస్‌గా ఉన్నారన్నారు. కేసు విచారణకు వైసీపీ నేతలు సహకరించాలని, చౌకబారు విమర్శలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఆపరేషన్ గరుడు గురించి మొదట్లో తాము పట్టించుకోలేదన్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే, ఆపరేషన్ గరుడు గురించి ఆలోచించాల్సి వస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు.