దాడి కేసు : జగన్ అలా చేయడం తప్పా...? ఒప్పా?
విశాఖపట్నం విమానాశ్రయంలో వైసిపి అధినేత జగన్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయన భుజానికి గాయమయింది. ఈ ఘటన దేశ వ్యాపితంగా సంచలనంగా మారింది. అయితే… కొందరు అధికారులు, ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే… జగన్ బాధితునిగా అనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…'జగన్‌ను విమానం ఎలా ఎక్కనిచ్చారు. విశాఖపట్నం నుంచి ఎలా వెళ్లనిచ్చారు’ అని ప్రశ్నించారు. ఎక్కడైనా నేరం జరిగితే నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవడం సహజమే. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లడమో, ఇంటికి పంపి విశ్రాంతి ఇవ్వడమో చేస్తారు. జగన్‌ను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లడానికి విమానం ఎక్కించడం ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారుల తప్పిదంగా చంద్రబాబు చెబుతున్నారు.
దాడిలో గాయపడిన జగన్… ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోకుండా ప్రైవేట్ ఆస్పత్రికి ఎలా వెళుతారు అని ముఖ్యమంత్రితో పాటు టిడిపి నేతలు ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించకుంటే నష్టమేమిటి? అనేది కొందరి ప్రశ్న.
గాయపడిన జగన్ మోహన్ రెడ్డి ఇక్కడే ఉండి పోలీసు కేసు పెట్టకుండా హైదరాబాద్ ఎలా వెళ్లిపోతారు… అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. దాడుల్లో గాయపడినవారు, ప్రమాదాల్లో గాయపడినవారు ముందుగా ఆస్పత్రిలో చేరుతారు. పోలీసులు అక్కడికి వచ్చి ఫిర్యాదు రాసుకుంటారు. అంతేతప్ప రక్తమోడుతున్న వ్యక్తి పోలీసులు వచ్చేదాకా ఉండి…. కేసు రాసుకున్నాక ఆస్పత్రికి వెళ్లరు. ఇటువంటి విషయాల్లో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తారు. జగన్ విషయంలో జరగాల్సిందీ అదేననేది మరికొందరి వాదన. ఇంతకీ జగన్ మోహన్ రెడ్డి చేసింది తప్పా ఒప్పా అనే చర్చ కూడా జరుగుతోంది.