బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (05:50 IST)

లాభాపేక్షతో కరోనా కేర్ సెంటర్ నిర్వహిస్తే కఠిన చర్యలు: ఆళ్ల నాని హెచ్చరిక

ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేసి, భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చర్యలు తప్పవని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) హెచ్చరించారు.

స్వర్ణప్యాలెస్ ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తక్షణం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి తన సహృదయాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.

స్థానిక కలెక్టర్. క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాల కుటుంబ సభ్యులకు మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్‌తో కలిసి ఉపముఖ్యమంత్రి ఆరుగురు కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు.

అనంత‌రం ఆళ్ల నాని మాట్లాడుతూ రమేష్ హాస్పటల్ ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలెస్‌లో నడుస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ ఘటన దురదృష్టకరం అన్నారు. రమేష్ ఆసుపత్రి వారి పూర్తి బాధ్యతారాహిత్యం వల్లే 10 మంది మృతి చెందడం, 20 మంది గాయాల పాలవ్వడం జరిగిందన్నారు.

రమేష్ ఆసుపత్రిపై అనేక సెక్షన్ల క్రింద కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రి వర్గం పూర్తి నిర్లక్ష్యంతో పాటు అధిక ఫీజులను కూడా వసూలు చేసినట్లు కమిటీ విచారణలో బహిర్గతమైంద‌న్నారు. ఇప్పటికే రెండు నోటీసులను జారీ చేశామని, ఈ నెల 30లోగా సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు తమ వైఖరి మార్చుకోపోతే ఇబ్బందుల పాలవుతున్నారు.

చట్టం, న్యాయం పరిధిలోనే ప్రభుత్వం పనిచేస్తుందని అందువల్లే అరెస్టులు  చేయలేదన్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, అప్పీలుకు వెళ్లారన్నారు. మీరు ఇచ్చే సమాచారాన్ని బట్టి ప్రభుత్వ పరంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేసినా, భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చర్యలు తప్పవని మంత్రి పేర్కొన్నారు.

లాభాపేక్ష ఎటువంటి అనుమతులు లేకుండా కోవిడ్ కేర్ పెంటర్లను నిర్వహించే వారికిది హెచ్చరిక అన్నారు. డబ్బే ప్రధానంగా విబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రమేష్ హాస్పటల్ కు పంబంధించి కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చెశామన్నారు.

స్వర్ణ ప్యాలెస్ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి సహృదయంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఘటనలో మృతి చెందిన 10 మందికి సంబంధించి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున మృతుల కుటుంబాలకు అందించడం జరిగిందని ఆళ్ల నాని తెలిపారు.

వీరిలో ఆరుగురుకు విజయవాడలో అందించామని, మిగిలిన వారిలో ముగ్గురికి మచిలీపట్నంలో, బాలింత అయిన ప్రకాశం జిల్లాకు చెందిన బాధితురాలికి అధికారుల ద్వారా వారి ఇంటి వద్దనే చెక్కులు అందించిన‌ట్లు తెలిపారు. ఇంటి పెద్దలు తల్లిదండ్రులు. భర్తలు కోల్పోయి ఆయా కుటుంబాలకు ఆదరణ లేకుండా పోయాయని, వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి పెద్ద మనస్సుతో స్పందించి రూ.50 లక్షలు పరిహారాన్ని అందించడం జరిగిందన్నారు.

అనంత‌రం మృతులు విజయవాడకు చెందిన మద్దాలి రమేష్ (65), సుంకర బాబూరావు (రవి) జగ్గయ్యపేటకు చెందిన భార్యాభర్తలు ఎస్.అబ్రహం (50), ఎస్.రాజాకుమారి (45), ప్రకాశం జిల్లా కందుకూరు చెందిన డి.వెంకటజయలక్ష్మి(48), గుంటూరు నిడుబ్రోలుకు చెందిన కొసరాజు సువర్ణలత (42)‌కు సంబంధించిన రూ.50 లక్షలు చెక్కులను బాధిత కుటుంబాల కుటుంబ సభ్యులకు అందజేశారు.

మృతులు మచిలీపట్నంకు చెందిన డొక్కు శివబ్రహ్మయ్య (57) మజ్జి గోపి (54), ఘంటసాల చెందిన పొట్లూరు పూర్ణచంద్రరావు (80)లకు సంబంధించి చెక్కులను మచిలీపట్నంలో అందజేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు, ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను. జాయింట్ కలెక్టర్లు కె.మాధవిలత, యల్.శివశంకర్, కె.మోహన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.