బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 7 అక్టోబరు 2021 (12:33 IST)

ఏది జ‌రిగినా డ్ర‌గ్స్ కి లింకు, టీడీపీ, వైసీపీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

రాష్ట్రంలో ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా, దానిని డ్ర‌గ్స్ తో లింక్ చేసేందుకు తెలుగుదేశం నేత‌లు కుట్ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. కాకినాడ‌లో పోర్టులో ఒక బోటు త‌గ‌ల‌బ‌డితే, అందులో హెరాయిన్ ఉంద‌ని, మ‌త్స్య‌కారుల‌ను అవ‌మానించే రీతిలో తెలుగుదేశం నేత‌లు ఆరో్పిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఒక ద‌శ‌లో టీడీపీ బృందంపై ఎమ్మెల్యే వ‌ర్గీయులు విరుచుకుప‌డ్డారు. 
 
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోర్టులో హెరాయిన్.. బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బృందo పర్యటించింది. పోర్టులో నిఘా వర్గాలను మరింత పటిష్ఠం చేయాలని డిమాండ్ చేసిన  టీడీపీ బృందం అక్క‌డ త‌నిఖీలు చేసింది. ఇటీవల ముంద్రా పోర్టులో పట్టుబడ్డ 72 వేల కోట్ల హెరాయిన్ కేసులో కాకినాడ పోర్టు పేరు కూడా ఉందని టీడీపీ బృందం ఆరోపించింది. కాకినాడ పోర్టు ద్వారా పిడిఎస్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోర్టు ఎగుమతుల ప్రాంతాన్ని  పరిశీలించి, పోర్టు అధికారులతో బియ్యం ఎగుమతుల గురించి ఆరా తీసిన తెలుగుదేశం పార్టీ బృందం ఈ ఆరోప‌ణ‌లు చేసింది. ఈ తెలుగుదేశం పార్టీ బృందంలో నిమ్మకాయల చినరాజప్ప, కొమ్మారెడ్డి పట్టాభి రామయ్య, జ్యోతుల నవీన్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు యనమల కృష్ణుడు, మోకా ఆనంద సాగర్ ఉన్నారు. 
 
వీరంతా మ‌త్స్య‌కారుల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని, ఇక్క‌డ డ్ర‌గ్స్ ఎగుమ‌తులు, దిగుమ‌తులు జ‌రుగుతున్నాయ‌ని కుయుక్తితో ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. టీడీపీ బృందంతో ఎమ్మెల్యే వ‌ర్గీయులు బాహాబాహీకి దిగారు. దీనితో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.