చీవాట్లు తిన్నాక మీకొచ్చిన ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలం విజయసాయి : బుద్ధా వెంకన్న
ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో చివాట్లు తిన్న తర్వాత మీకు వచ్చిన ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలం విజయసాయి రెడ్డిగారు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా సెటైర్లు వేశారు.
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. పీపీఏల విషయంలో కేంద్రం మొట్టికాయిలు వేసినా నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అంటూ జగన్ రాష్ట్రాన్ని అంధకారం చేసారు.
సీఎం ఉంటున్న తాడేపల్లిలోనే కరెంట్ పీకేస్తున్నారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పక్కర్లేదు. దోమలు, ఎలుకల నివారణకు అంతఖర్చా అని వితండవాదన చేసి వెనక్కి తగ్గలేక విషజ్వరాలతో ప్రజల్ని పొట్టనపెట్టుకున్నారు.
ఇప్పుడు సోలార్ విద్యుత్‌కి అంత రేటా అంటూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. మీ ప్రభుత్వం తీసుకుంటున్న చెత్త నిర్ణయాలతో దేశంలో ఎక్కడా పెట్టుబడి పెట్టడానికి విద్యుత్ కంపెనీలు ముందుకు రావడం లేదు. జగన్ పేరు చెప్పగానే పెట్టుబడిదారులు మాయమవుతున్నారు.
మీ పాలన చూశాక ఏకంగా కేంద్రప్రభుత్వం ప్రత్యేకచట్టం తీసుకొస్తుంది అంటేనే మీది ఎంత గొప్పపాలనో అర్థమవుతుంది. విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఇబ్బందిపడకుండా జే ట్యాక్స్ నుండి రక్షణ కల్పిస్తూ కేంద్రం ప్రత్యేకచట్టం తీసుకొస్తుంది.
ప్రపంచానికి లెక్కలు చేప్పే జగన్‌కి, మీకు టెక్నాలజీ అభివృద్ధిచెందే క్రమంలో పునరుత్పాదక విద్యుత్ రేట్లు తగ్గుతాయని తెలియకపోవడం అమాయకత్వమని మాత్రం అనుకోలేం అంటూ ట్విట్టర్ ఖాతాలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు.